అంచనాలు అందుకోలేక పోయిన 'పిట్టకథలు'

అంచనాలు అందుకోలేక పోయిన 'పిట్టకథలు'

తరుణ్ భాస్కర్, నందినీరెడ్డి, నాగ్ అశ్విన్, సంకల్ప్ రెడ్డి... ఈ దర్శకుల పేర్లు అందరికీ సుపరిచితం. టాలీవుడ్ లో పేరున్న దర్శకులు వీరు. వీరి కలయికలో ఓ అంథాలజీ వస్తుందంటే... దానిని నెట్ ఫ్లిక్స్ తీస్తుందంటే అంచనాలు అంబరాన్నంటక మానవు. అలా వీరందరి కలయికలో వచ్చిందే పిట్టకథలు. గత వారం స్ట్రీమింగ్ అయిన ఈ ఆంధాలజీ ఆ అంచనాలు అందుకోవటంలో మాత్రం ఘోరంగా విఫలం అయిందనే చెప్పాలి. ఈ ఆంథాలజీ నెట్ ఫ్లిక్స్ వారి ప్రమాణాలకు తగ్గ స్థాయిలో లేదన్నది చూసిన వారి మాట. 'పిట్లకథలు'లో భాగం వచ్చిన తరుణ్ భాస్కర్ 'రాములా' బాగుందని అనిపించింది. ఆ తర్వాత వచ్చిన నందినీ రెడ్డి 'మీరా' కొంత వరకూ బెటర్. అయితే నాగ్ అశ్విన్ తీసిన 'ఎక్స్ లైఫ్', సంకల్స్ రెడ్డి 'పింకీ' మాత్రం ఆకట్టకోలేక పోయాయనే చెప్పాలి. ఎక్స్ లైఫ్ కాన్సెప్ట్ బాగానే ఉన్నప్పటికీ తెరకెక్కించిన విధానం అంతగా ఇంప్రెస్ చేయలేకపోయింది. మొత్తం మీద పిట్టకథలు సినిమా పరిభాషలో చెప్పాలంటే ప్లాఫ్ అనే అనాలి.

నెట్ ఫ్లిక్స్ స్థాయి కాదు...

ప్రపంచ‌వ్యాప్తంగా నెట్ ఫ్లిక్స్ సీరిస్ అంటే ప్రేక్షకులకు ఓ గురి ఉంది. నిజానికి ఈ సంస్థ క్వాలిటీ బాగాలేకుంటే కోట్లు పెట్టి తీసిన సిరీస్‌, సినిమాలు కూడా పక్కనపెట్టేస్తుంద‌నే నానుడి ఉంది. ఈ విష‌యంలో అస‌లు రాజీ ప‌డ‌ద‌ంటుంటారు. నిజానికి నెట్ ఫ్లిక్స్ తెలుగులోకి అడుగు పెట్టింది ఈ పిట్టక‌థ‌లుతోనే... కొన్నేళ్ళుగా ఇండియ‌న్ మార్కెట్ మీద కన్నేసి వివిధ భాష‌ల్లో ఒరిజిన‌ల్ కంటెంట్ తీస్తూ వస్తోంది నెట్ ఫ్లిక్స్. హిందీతో పాటు త‌మిళంలోనూ నెట్ ఫ్లిక్స్ సిరీస్‌ వ‌చ్చాయి. త‌మిళంలో ఆ సంస్థ తీసిన 'పావ క‌థైగ‌ల్' చూస్తే నెట్ ఫ్లిక్స్ స్థాయి ఏమిటో తెలిపిపోతుంది. లేటుగా వచ్చినా లేటెస్ట్ గా వస్తారనే కాయిన్ కి వ్యతిరేకంగా 'పిట్టకథలు'తో వచ్చిన నెట్ ఫ్లిక్స్ నిరాశపరిచిందనే చెప్పాలి. మరి రాబోయే రోజుల్లో మన తెలుగు ఆడియన్స్ ను నెట్ ఫ్లిక్స్ ఎలాంటి సీరీస్, సినిమాలతో ఆకట్టుకుంటుందో చూద్దాం.