'వకీల్ సాబ్'కు తప్పని పైరసీ శిక్ష...!

'వకీల్ సాబ్'కు తప్పని పైరసీ శిక్ష...!

కరోనా వైరస్ తో మిగతా అన్ని రంగాల కంటే నాలుగింతలు ఎక్కువే సతమతం అవుతోంది సినిమా ఫీల్డ్. థియేటర్ల మూసివేత, తరువాత తెరవటం, తెరిచినా జనం పెద్దగా రాకపోవటం... గత సంవత్సరం అంతా పీడ కలలా గడిచింది. ఇప్పుడు కూడా ఇంకా బాక్సాఫీస్ తేరుకోవటం లేదు. సెకండ్ వేవ్ ఎఫెక్ట్ ఎంతగా ఉంటుందో అర్థం కావటం లేదు. అయితే, ఈ మొత్తం సంక్షోభంలోనే 'వకీల్ సాబ్' లాంటి భారీ చిత్రాలకు పైరసీ పీడ కూడా తప్పటం లేదు. చాలా గ్యాప్ తరువాత వచ్చిన పవర్ స్టార్ మూవీకి మంచి ఓపెనింగ్స్ అయితే వచ్చాయి. కానీ, ఇంతలోనే మూవీరూల్జ్, టెలిగ్రామ్ లాంటి వెబ్ సైట్స్ లో 'వకీల్ సాబ్' ఫుల్ లెంగ్త్ మూవీ ప్రత్యక్షం కావటం చాలా మందిని ఆందోళనకు గురి చేస్తోంది. మూవీకి మంచి రివ్యూస్ వచ్చినప్పటికీ కలెక్షన్లపై పైరసీ ప్రభావం పడుతుందని దర్శకనిర్మాతలు, ఫ్యాన్స్ భయపడుతున్నారు. ఇటువంటి పరిస్థితే ధనుష్ మూవీ 'కర్నన్'కి కూడా ఎదురైంది. కోలీవుడ్ లో మంచి అంచనాల నడుమ విడుదలైన ధనుష్‌ స్టారర్ ఆన్ లైన్ లో లీకైపోయింది. 'వకీల్ సాబ్' అయితే ప్రస్తుతం హార్డ్ కోర్ ఫ్యాన్స్ హంగామాతో హౌజ్ ఫుల్ గా నడుస్తోంది. చూడాలి మరి, మహమ్మారి సమయంలో మాయదారి పైరసీ ఎఫెక్ట్ ఎంతగా ఉంటుందో...!