సోదరుడిని కోల్పోయిన నటి పియా బాజ్ పాయ్!

సోదరుడిని కోల్పోయిన నటి పియా బాజ్ పాయ్!

తెలుగుతో పాటు దక్షిణాది భాషా చిత్రాల్లోనూ, హిందీలోనూ నటించిన పియా బాజ్ పాయ్ మంగళవారం ఉదయం తన సోదరుడిని కోల్పోయింది. కొద్దికాలం క్రితం పియా బాజ్ పాయ్ సోదరుడు కరోనా బారిన పడ్డాడు. అతన్ని హాస్పిటల్ లో చేర్పించడానికి ఆమె తన స్థాయిలో అన్ని ప్రయత్నాలు చేసింది. చివరకు ఉత్తరప్రదేశ్ ఫరూఖాబాద్ లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో అతన్ని చేర్పించింది. కానీ అప్పటికే పరిస్థితి విషమించడంతో వెంటిలేటర్ సాయం పడింది. అందుకోసం ఆమె సోషల్ మీడియా వేదికగా బీజేపీ నేతలతో సహా పలువురికి తన సోదరుడిని కాపాడమని విన్నవించుకుంది. కానీ ఫలితం లేకపోయింది. వెంటిలేటర్ బెడ్ సమయానికి దొరకని కారణంగా ఈ రోజు ఉదయం పియా బాజ్ పాయ్ సోదరుడు కన్నుమూశాడు. ఎంత ప్రయత్నించినా తన సోదరుడిని కాపాడుకోలేకపోయానంటూ ఆవేదన వ్యక్తం చేసింది పియా బాజ్ పాయ్. ఇదే పరిస్థితి మరింత మంది సెలబ్రిటీస్ ఫేస్ చేస్తున్నారు. బాలీవుడ్ కథానాయిక భూమి ఫెడ్నేకర్ సైతం ఇదే చెబుతోంది. కేవలం ఇరవై నాలుగు గంటల్లో తనకు ఎంతో దగ్గరైన ఇద్దరిని కోల్పోయానని, మరో ముగ్గురి  పరిస్థితి ఆందోళనకరంగా ఉందని అంటోంది. వాళ్ళకు ఆక్సిజన్, హాస్పిటల్స్ లో బెడ్స్ సమకూర్చడం గగనంగా ఉందని వాపోతోంది. ఎంతో గుర్తింపు, గౌరవం ఉన్న సెలబ్రిటీస్ పరిస్థితే ఇలా ఉంటే సామాన్యుల మాటేమిటి!?