లీటర్ పెట్రోల్ రూ.75కే..! ఎలా సాధ్యం..?
చమురు ధరలు మండిపోతున్నాయి. పలు రాష్ట్రాల్లో లీటర్ పెట్రోల్.. వంద రూపాయల మార్కు దాటేసింది. డీజిల్, పెట్రోల్ ధరలు రోజురోజుకూ పెరిగిపోతుండడంతో.. ప్రజలు బెంబేలెత్తుతున్నారు. అసలే లాక్డౌన్తో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు తగ్గి బతుకు బారమైందని.. ఇలాంటి పరిస్థితుల్లో పెట్రోల్ మంటలు.. తమ బతుకులను కాల్చేస్తున్నాయని వాపోతున్నారు. అయితే... చమురు ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి తీసుకొస్తే దేశంలో లీటర్ పెట్రోల్ ధర 75 రూపాయలకు దిగొస్తుందని ఆర్థికవేత్తలు చెబుతున్నారు.
పెట్రోలియం ఉత్పత్తులపై విధించే వ్యాట్, పన్నులు.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రధాన ఆదాయవనరులు. అందువల్లే చమురు ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి తీసుకొచ్చేందుకు కేంద్రం, రాష్ట్రాలు సుముఖంగా లేవు. ప్రస్తుతం పెట్రోల్, డీజిల్పై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు.. రవాణా ఛార్జీలు, డీలర్ కమిషన్, ఎక్సైజ్ సుంకం, సెస్, వ్యాట్ ఇలా వివిధ రకాల పన్నులు, ఛార్జీలు విధిస్తున్నాయి. వీటిని జీఎస్టీ పరిధిలోకి తీసుకొస్తే అత్యధికంగా 28శాతం పన్ను ఉంటుంది. చమురు ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి తీసుకొస్తే రాష్ట్రాలకు నష్టం తప్పదు. అలా చేస్తే, వినియోగదారులపై 30 రూపాయల వరకు భారం తగ్గుతుంది. అప్పుడు లీటర్ పెట్రోల్ రూ. 75, లీటర్ డీజిల్ రూ. 68కే వస్తుందని చెబుతున్నారు. అంతర్జాతీయ ధరలకు అనుగుణంగా ఇంధన ధరల్లో రోజువారీ మార్పులు చేయకుండా చమురు ధరలను స్థిరీకరించాలని ఆర్థికవేత్తలు సూచించారు. ఈచర్యలు చేపట్టడం వల్ల ధరల పెరుగుదలను నిరోధించవచ్చన్నారు.
ఫేస్ బూక్ వ్యాఖ్యలు (0)