బాబు గారు రెడీగా ఉండండి, ఢిల్లీ నుంచి బాబాయిలు వస్తున్నారు !

బాబు గారు రెడీగా ఉండండి, ఢిల్లీ నుంచి బాబాయిలు వస్తున్నారు !

ఇవాళ జరిగిన ఏపీ క్యాబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. దీనిపై మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ, చంద్రన్న సంక్రాంతి, క్రిస్మస్ కానుక, రంజాన్ తోఫాలో అక్రమాలు జరిగాయని, రూ.150 కోట్ల అక్రమాలు జరిగాయని నిర్దారణ జరిగిందని అన్నారు. ఫైబర్ నెట్ ప్రాజెక్టు విషయంలో టెరా సాఫ్ట్ కంపెనీకి కట్టబెట్టే  క్రమంలో అక్రమాలు జరిగాయని, సెటాప్ బాక్సుల కొనుగోళ్లల్లోనూ నిబంధనలకు విరుద్దంగా టెండర్లు ఖరారు చేశారని అన్నారు. ఎల్-1కు కాకుండా వేరే వారికి టెండర్ల పనిని పంచి పెట్టారని దీనిపై సీబీఐ ఎంక్వైరీకి ఆదేశించాలని కెబినెట్ నిర్ణయం తీసుకుందని అన్నారు. సీబీఐ విచారణలో అన్ని విషయాలు నిగ్గు తేలుతాయని అన్నారు.

త్వరలోనే ఢిల్లీ నుంచి బాబాయిలు వస్తున్నారు.. లెక్కలు చెప్పండని బాబుకు సవాల్ విసిరారు. దమ్ముంటే విచారణ వేయండన్న చంద్రబాబు విచారణ ఎదుర్కొవడానికి సిద్దంగా ఉండాలని అన్నారు. గ్రీన్ కోకు ఇచ్చిన విద్యుత్ ప్రాజెక్టును కొనసాగిస్తున్నామని, ప్రాజెక్టు నిర్మాణం కోసం గత ప్రభుత్వం 4700 ఎకరాల మేర భూ సేకరణకు అనుమతిచ్చిందని, గత ప్రభుత్వం ఎకరాకు రూ. 2.50 లక్షలను రైతులకివ్వాలని నిర్ణయిస్తే.. ఈ ప్రభుత్వం రూ. 5 లక్షలు ఇవ్వాల్సిందిగా కంపెనీతో సంప్రదింపులు జరిపిందని అన్నారు. గత అక్రమాలపై తాము సిట్ వేస్తే పారిపోతున్నారని, కక్ష సాధింపులంటూ ఆరోపణలు చేస్తున్నారని వెల్లడించారు. అయితే చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుందని, ఒక్కొక్కరుగా అరెస్ట్ అవుతున్నారని వివరించారు.