ఇంటిపోరుతో మనశ్శాంతి లేదంటున్న మంత్రి..!

ఇంటిపోరుతో మనశ్శాంతి  లేదంటున్న మంత్రి..!

మంత్రి పదవి వచ్చినా సంతోషం లేదా? ఇంటిపోరు ఉక్కిరిబిక్కిరి చేస్తోందా? జిల్లాలో సొంత పార్టీ ఎమ్మెల్యేలు.. ఇంట్లో కుటుంబసభ్యులతో వేగలేకపోతున్నారా? ఇంతకీ ఎవరా మంత్రి? ఏమా పోరు? 

సబిత రాజకీయాల్లో కొనసాగుతారా లేదా అనుకున్నారు!

అనుకోని పరిస్థితుల్లో రాజకీయాల్లోకి వచ్చిన సబితా ఇంద్రారెడ్డికి ఆది నుంచి ఆటుపోట్లు తప్పడం లేదు. తల్లిగా.. రాజకీయ నేతగా.. మంత్రిగా ఎన్నో క్లిష్టమైన పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత రాష్ట్ర రాజకీయాల్లో అనేక మార్పులు చేర్పులు చోటుచేసుకున్నాయి. తెలంగాణ ఏర్పాటయ్యాక రాజకీయాల్లో సబితా కొనసాగుతారా లేదా అనే ప్రశ్న కూడా తలెత్తింది.

2018 ఎన్నికల తర్వాత రాజకీయాల్లో అనూహ్య మార్పులు!

2014 ఎన్నికల్లో సబితా కుమారుడు కార్తీక్‌రెడ్డి చేవెళ్ల ఎంపీగా కాంగ్రెస్‌ పార్టీ నుంచి బరిలో దిగినా.. ఓడిపోయారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నుంచి సబితా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. టిఆర్ఎస్ అభ్యర్థి తీగల కృష్ణారెడ్డి ఓడిపోయారు. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరని అంటారు. తీగల, సబిత ఇద్దరూ ఇప్పుడు ఒకే పార్టీలో ఉన్నారు. అలానే 2018 ఎన్నికల అనంతరం రాజకీయాల్లో ఊహించని మార్పులు శరవేగంగా చోటు చేసుకున్నాయి.

కార్తీక్‌రెడ్డికి ఎలాంటి రాజకీయ పదవులు రాలేదు!

సబిత టీఆర్‌ఎస్‌లో చేరడంతో.. ఆమెను కేబినెట్‌లోకి తీసుకున్నారు ముఖ్యమంత్రి కేసీఆర్‌. కొడుకు రాజకీయ భవిష్యత్‌ కోసం పార్టీ మారిన సబితకు ఇంటి పోరు తప్పడం లేదని తెలుస్తోంది. 2014 ఎన్నికల్లో ఓటమి తరువాత కార్తీక్ రెడ్డికి ఎలాంటి రాజకీయ పదవులు రాలేదు. ఇప్పుడు టిఆర్ఎస్‌లో ఉన్నా పదవి లేదు. ఇప్పట్లో ఎలాంటి ఎన్నికలు లేవు. మళ్లీ ఎన్నికల వరకూ ఎలా వేచి ఉండాలని తల్లిని ప్రశ్నిస్తున్నారట కార్తీక్. ఇదే సమయంలో జిల్లాల్లో ఇద్దరు మేనళ్లుళ్లూ ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి శత్రువుగా భావిస్తున్నారు. ఇన్నాళ్లు తమ రాజ్యంగా భావించిన ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో సబిత దూసుకుపోతుండటంతో వారికి రుచించడం లేదట. 

సబితపై అదే పనిగా ఫిర్యాదులు చేస్తున్నారా?

మంత్రి సబితాతో సర్దుకుపోలేక అధిష్ఠానం చెవిలో జోరీగా మారి.. పదే పదే ఫిర్యాదులు చేస్తున్నారట. సొంత తమ్ముడు నరసింహారెడ్డి రాజకీయ పరిస్థితి కూడా బాగోలేదు.  2009లో జడ్పీటీసీగా పోటీ చేసి ఓడిపోయారు. అప్పటి నుంచి క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉంటున్నారాయన. సబిత మంత్రిగా ఉండటంతో తనకు ఏదైనా దారి చూపించాలని కోరుతున్నారట నరసింహారెడ్డి. 

టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు సఖ్యతగా ఉండటం లేదా?

ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో గెలుపొందిన ఎమ్మెల్యేలలో చాలా మంది మంత్రి పదవులు ఆశించారు. కానీ.. కాంగ్రెస్‌ నుంచి వచ్చిన సబితకు కేబినెట్ బెర్త్‌ దక్కింది. ఇది రుచించని చాలా మంది ఎమ్మెల్యేలు ఆమెతో సఖ్యతగా ఉండటం లేదని పార్టీ వర్గాల టాక్‌. దీంతో అటు ఇంటిపోరు.. ఇటు పార్టీలో లొల్లితో మంత్రి సబితకు మనశ్శాంతి లేదన్నది ఆమె సన్నిహితుల మాట. టిఆర్ఎస్ అధిష్ఠానం పార్టీ పదవులు, ప్రభుత్వంలో నామినేటెడ్ పోస్టులు భర్తీ చేస్తే.. ఈ తలనొప్పులు కొంత వరకూ తగ్గుతాయని లెక్కలు వేసుకుంటున్నారట. మరి.. మంత్రికి ఆ మేరకు ఊరట లభిస్తుందో లేదో చూడాలి.