ఎమ్మెల్యే రాంబాబు వల్లే వెంగయ్య బలి-పవన్‌ కల్యాణ్‌

ఎమ్మెల్యే రాంబాబు వల్లే వెంగయ్య బలి-పవన్‌ కల్యాణ్‌

వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు బెదిరింపుల వల్లే జనసేన కార్యకర్త వెంగయ్య నాయుడు ఆత్మహత్య చేసుకున్నాడంటూ విరుచుకుపడ్డారు జనసేన అధినేత పవన్ కల్యాణ్... ఇవాళ ఒంగోలులో వెంగయ్య కుటుంబాన్ని పరామర్శించిన ఆయన.. ఆ కుటుంబానికి అండగా ఉంటానని భరోసా కల్పించారు.. రూ.8.5 లక్షల ఆర్థిక సాయం చేయడంతో పాటు.. పిల్లల చదవు బాధ్యతలను కూడా తీసుకున్నారు.. ఈ సందర్భంగా...  వైసీపీ ఎమ్మెల్యే రాంబాబుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు జనసేనాని.. ఏం తప్పుచేసాడని వెంగయ్య ప్రాణాలు కోల్పోయాడని ప్రశ్నించారు. గ్రామ సమస్యపై ఎమ్మెల్యేని అడిగినందుకు ఆయన మాటలకు మానసిక వేదనకు గురయ్యాడని.. ప్రశ్నించినందుకే వెంగయ్యను చంపేశారని ఆరోపించారు. ఊరికి రోడ్డు అడిగినందకు వెంగయ్యను బలి తీసుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేసిన పవన్.. వైసీపీకి 151 సీట్లు ఇస్తే.. ఒక బిడ్డకు తండ్రిని దూరం చేసింది అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.. సీఎం జగన్ రెడ్డి గారు మీ ఎమ్మెల్యే చేసిన పనికి శిక్షిస్తారా..? మీకు ఆ ధైర్యం ఉందా..? అంటూ ప్రశ్నించిన పవన్.. అన్నా రాంబాబు గుర్తుంచుకో నిన్ను అద:పాతాళానికి తొక్కేస్తాం అంటూ హెచ్చరించారు.. వెంగయ్య మృతి వైసీపీ పతనానికి నాంది అంటూ వ్యాఖ్యానించిన జనసేనాని.. జనసేన అధికారంలోకి వచ్చిన తర్వాత బాధ్యులపై చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. ఇక, వెంగయ్య నాయుడు ఆత్మహత్య వ్యవహారంపై జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు పవన్ కల్యాణ్.