మహేశ్, పవన్, నాగ్ సంక్రాంతి వార్

మహేశ్, పవన్, నాగ్ సంక్రాంతి వార్

తండ్రి కృష్ణ లాగానే సంక్రాంతి బరిలో రెగ్యులర్ గా నిలిచే ప్రయత్నం చేస్తుంటాడు మహేశ్ బాబు. కానీ ఈ సారి అతనికి అదే సీజన్ లో ఇటు పవన్ కళ్యాణ్ అటు నాగార్జున గట్టి పోటీ ఇవ్వబోతున్నారు. ఈ ముగ్గురి సినిమాలు 2022 సంక్రాంతి బరిలో దిగబోతున్నాయి.

కరోనా కారణంగా ఆలస్యంగా సెట్స్ పైకి వెళ్ళిన 'సర్కారు వారి పాట' రిలీజ్ విషయంలో ప్రిన్స్ మహేశ్ బాబు ఎలాంటి తొందర పడటం లేదు. నింపాదిగా షూటింగ్ పూర్తి చేసుకుని వచ్చే యేడాది సంక్రాంతికి జనం ముందుకు వస్తానని చెప్పేశాడు. దాంతో ఈ యేడాది మహేశ్ మూవీ ఒక్కటీ విడుదల కాకుండా అయిపోయింది. ఇక ఇప్పటికే సెట్స్ పై ఉన్న పవన్ కళ్యాణ్ - క్రిష్‌ మూవీని సైతం సంక్రాంతికే విడుదల చేస్తామని నిర్మాత ఎ.ఎం. రత్నం అధికారికంగా ఆ మధ్య ప్రకటించారు. ఇదిలాఉంటే ఇప్పుడు నాగార్జున సైతం అదే సీజన్ పై కన్నేయడం చర్చనీయాంశంగా మారిపోయింది. చిత్రం ఏమంటే... ఈ ముగ్గురు స్టార్ హీరోలూ సంక్రాంతి సీజన్ లో ఒకరితో ఒకరు పోటీ పడటం అనేది గతంలో ఎప్పుడూ జరగలేదు. ఇదే మొదటిసారి!!

నాగార్జున నటించిన 'సోగ్గాడే చిన్ని నాయనా' సినిమా 2016 సంక్రాంతి కానుకగా విడుదలైంది. ఆ యేడాది ఆ సీజన్ లో మంచి విజయాన్ని సాధించింది. విశేషం ఏమంటే... ఆ చిత్ర విజయోత్సవంలో దానికి ప్రీక్వెల్ గా 'బంగర్రాజు' సినిమా తీస్తానని, దాన్ని 2017 సంక్రాంతికి విడుదల చేస్తానని నాగార్జున తెలిపారు. కానీ అది కార్యరూపం దాల్చడానికి చాలా సమయమే పట్టింది. మధ్యలో పలు చిత్రాలలో నాగార్జున నటిస్తే, దర్శకుడు కళ్యాణ్ కృష్ణ 'రారండోయ్ వేడుక చూద్దాం, నేల టిక్కెట్' సినిమాలను రూపొందించాడు. 

నాగార్జున తాజాగా 'బంగర్రాజు' మూవీ గురించి పెదవి విప్పారు. ఈ యేడాది జూన్ లేదా జులైలో షూటింగ్ ప్రారంభించి, జనవరిలో సంక్రాంతికి కానుకగా రిలీజ్ చేస్తానని అధికారికంగా ప్రకటించారు. సో... ఆరేళ్ళ తర్వాత 'సోగ్గాడే చిన్ని నాయనా'కు ప్రీక్వెల్ రాబోతోందన్న మాట. ఏదేమైనా... రాబోయే సంక్రాంతి స్టార్ హీరోలతో సందడి చేసేట్టుగానే కనిపిస్తుంది. మరి ఈ మధ్యలో ఇంకెన్ని సినిమాలను మన దర్శక నిర్మాతలు ఆ సీజన్ కు సిద్ధం చేస్తారో చూడాలి.