తిరుపతిలో వేడెక్కిన రాజకీయం..

తిరుపతిలో వేడెక్కిన రాజకీయం..

తిరుపతి ఉప ఎన్నిక ప్రచారం జోరందుకుంటుంది. స్టార్‌ క్యాంపెయినర్లు రంగంలోకి దిగుతుండడంతో కార్యకర్తలు, ఓటర్లలో ఆసక్తి పెరుగుతోంది. జనసేన మిత్ర పక్షం బీజేపీ తరపున ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు జనసేనాని పవన్‌ కల్యాణ్‌. తిరుపతిలో పాదయాత్ర నిర్వహించనున్నారు. 

పోలింగ్ గడువు సమీపిస్తుండడంతో తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికల వేడి పతాక స్థాయికి చేరుకుంటోంది. ప్రధాన పార్టీలు ఈ ఎన్నికను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. దీంతో ప్రచారం వాడీవేడిగా సాగుతోంది. స్టార్ క్యాంపెయినర్లు ప్రచార బరిలో దిగుతున్నారు. మిత్రపక్షం బీజేపీ తరపున జనసేన అధినేత పవన్ కల్యాణ్ పాదయాత్ర నిర్వహించనున్నారు. భారీ బహిరంగ సభలో మాటల తూటాలు పేల్చనున్నారు.

తిరుపతి ఉప పోరులో బీజేపీ అభ్యర్థి, రిటైర్డ్ ఐఎఎస్ అధికారిణి రత్నప్రభకు మద్దతుగా జనసేన ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటోంది. ఇందులో భాగంగా ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ప్రచార బరిలో దిగనున్నారు. తిరుపతిలో పాదయాత్ర నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు ఎంఆర్ పల్లి సర్కిల్ నుంచి శంకరంబాడి సర్కిల్ వరకు పవన్ కల్యాణ్ పాదయాత్ర కొనసాగుతుంది. రెండు కిలోమీటర్ల పాటు సాగే పాదయాత్రలో రాయలసీమ జిల్లాల నుండి పెద్ద ఎత్తున అభిమానులు హాజరుకాబోతున్నారు. అనంతరం శంకరంబాడి సర్కిల్ సమీపంలోని అన్నపూర్ణ టెంపుల్ వద్ద ఏర్పాటుచేసిన బహిరంగ సభలో ప్రసంగిస్తారు.

పాదయాత్రకు బీజేపీ రాజ్యసభ్యులు జీవిఎల్, టిజి వెంకటేష్, వైఎస్ చౌదరి, పార్టీ అధ్యక్షుడు సోము వీర్రాజు, దుబ్బాక ఎమ్మెల్యే రఘనందన్ తో పాటు పార్టీ పెద్దలు హాజరుకానున్నారు. పాదయాత్రలో పవన్ కళ్యాణ్ ఎలాంటి వ్యాఖ్యలు చేస్తారనే ఆసక్తి అందరిలో నెలకొంది.