రాపాకకు పవన్ కళ్యాణ్ రిటర్న్ గిఫ్ట్?

రాపాకకు పవన్ కళ్యాణ్ రిటర్న్ గిఫ్ట్?

జనసేన నుంచి ఒకే ఒక్కడిగా గెలిచి..  అధికారపార్టీ పంచన చేరిన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్‌కు రిటర్న్‌ గిఫ్ట్‌ ఇవ్వాలని పవన్‌ కల్యాణ్‌ నిర్ణయించారా? సొంత పార్టీకి సున్నం కొట్టిన ఎమ్మెల్యేకు పవన్‌ ఇవ్వాలనుకుంటున్న రిటర్న్‌ గిఫ్ట్ ఏంటి? రాజోలు జనసైనికులకు జనసేనాని ఏం చెప్పారు? పవన్‌ ఆదేశాలు పార్టీలో వేడిపుట్టించాయా? 

గీత దాటినా రాపాకపై వేటు వేయని పవన్‌!

రాపాక వరప్రసాద్‌. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పార్టీ నుంచి గెలిచిన ఏకైక ఎమ్మెల్యే. రాజోలు ఎస్సీ నియోజకవర్గం నుంచి గెలిచిన  రాపాకపై అప్పట్లో రాష్ట్రమంతా ఒక్కటే చర్చ. దానికితోడు తాను నెంబర్‌ వన్‌గా ఉంటానని.. 152 కాదలచుకోలేదని గంభీరమైన డైలాగులు చెప్పి వేడిపుట్టించారు. కానీ.. మాటపై నిలబడకుండా మడమ తిప్పేశారు. జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ను, పార్టీ విధానాలను విమర్శిస్తూ సీఎం జగన్‌కు జై కొట్టడానికి ఎంతో సమయం తీసుకోలేదు రాపాక. ఎస్సీ ఎమ్మెల్యే అని భావించారో... ఉన్న ఒక్క ఎమ్మెల్యేపై చర్యలు తీసుకుంటే బాగోదని అనుకున్నారో ఏమో తిరుగుబాటు ప్రకటించినా రాపాక వరప్రసాద్‌పై పవన్‌ చర్యలు తీసుకోలేదు. జనసేనాని ఎప్పుడు వేటు వేస్తారా.. ఎప్పుడెప్పుడు కండువా మార్చేద్దామా అని ఎదురు చూస్తున్నారు ఈ ఏక్‌ నిరంజన్‌. గీత దాటిన సొంత పార్టీ ఎమ్మెల్యేపై పవన్‌ కల్యాణ్‌ కటువుగా మాట్లాడిందీ లేదు. ఆయనకేం ఇబ్బందులు ఉన్నాయో అని చాలాసార్లు రాపాకపై  మీడియా వేసిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వకుండా తప్పించుకున్నారు. 

రాపాకకు రిటర్న్‌ గిఫ్ట్‌ ఇవ్వాలని పవన్‌ డిసైడ్‌ అయ్యారా? 
జనసేన సభ్యత్వ నమోదులో రాజోలుకు మొదటి స్థానం!

ఇప్పుడు రాపాక విషయంలో ఆ కూలింగ్‌ పిరియడ్‌ అయిపోయిందట. జనసేనాని గేర్‌ మార్చారని సమాచారం. రాపాక వరప్రసాద్‌కు రిటర్న్‌ గిఫ్ట్‌ ఇవ్వాలని పవన్‌ కల్యాణ్‌ డిసైడైనట్టు పార్టీలో ప్రచారం జరుగుతోంది. ఇన్నాళ్లూ జనసేనపైనా.. తనపైనా విమర్శలు చేసిన ఎమ్మెల్యేకు గుణపాఠం చెప్పే టైమ్‌ వచ్చిందని పార్టీ శ్రేణులకు జనసేనాని చెప్పినట్టు తెలుస్తోంది. ఇటీవల జనసేన క్రియాశీల సభ్యత్వ నమోదును ప్రారంభించగా అందులో రాజోలు మొదటి స్థానంలో నిలిచిందట. తిరుగుబాటు ప్రకటించిన ఎమ్మెల్యేపై  కసి మీదనో లేక అంతా పవన్‌ వైపే ఉన్నామని చెప్పడానికో కానీ ప్రత్యేక కమిటీలు వేసి మరీ క్రియాశీల సభ్యత్వాలు పెంచారట. రాజోలులో ఎమ్మెల్యే రాపాక ప్లేట్‌ ఫిరాయించిన తర్వాత అక్కడ జనసేన ఇంఛార్జ్‌ లేరు. అయినా సభ్యత్వ నమోదులో లోకల్‌ నాయకత్వం చూపించిన చొరవను జనసేనాని ప్రత్యేకంగా అభినందించారట. 

రెండు రోజుల భేటీలో ప్రత్యేకంగా రాజోలుపై పవన్‌ ఫోకస్‌!

ఇటీవల కోస్తా ప్రాంత జనసేన నాయకులతో సమావేశం నిర్వహించారు పవన్‌ కల్యాణ్‌.  రెండురోజుల పాటు నిర్వహించిన ఈ సమావేశాలలో రాజోలు కోసమే ప్రత్యేకంగా సమయం కేటాయించి స్థానిక నాయకులతో మంతనాలు చేశారట జనసేనాని. ఈ సందర్భంగా స్థానిక సంస్థల ఎన్నికల ప్రస్తావన వచ్చిందట.  స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన ఎక్కువ సీట్లు గెలిచి పార్టీ సత్తా చాటాలని సూచించారట. జనసేన టికెట్‌పై గెలిచి.. అది సొంత విజయంగా చెప్పుకొంటున్న రాపాకకు గట్టి జవాబివ్వాలని కూడా స్పష్టం చేసినట్టు సమాచారం. ఇందుకోసం నాయకులు, కార్యకర్తలు బాగా కష్టపడాలని పవన్‌ క్లాస్‌ తీసుకున్నట్టు తెలుస్తోంది. దీంతో రాజోలులోని స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎక్కువ స్థానాల్లో గెలిచి తిరుగుబాటు ప్రకటించిన ఎమ్మెల్యే రాపాక ప్రసాద్‌కు పవన్‌ కల్యాణ్ రిటర్న్‌ గిఫ్ట్‌ ఇవ్వబోతున్నట్టు ప్రచారం మొదలైంది. 

పవన్‌ గేర్‌ మార్చారని జనసేనలో చర్చ!

ఇన్నాళ్లూ రాపాక కామెంట్స్‌పై  మౌనం దాల్చిన పవన్‌ కల్యాణ్‌ ఇప్పుడు గేర్‌ మార్చడంపై జనసేనలో కూడా చర్చ ప్రారంభమైందట. ఇది తెలుసుకున్న జనసైనికులు సైతం ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారా అని ఎదురు చూస్తున్నారట. మరి.. రాపాకకు పవన్‌ కల్యాణ్ ఇచ్చే రిటర్న్‌ గిఫ్ట్‌ ఎలా  ఉంటుందో చూడాలి.