వైజాగ్ స్టీల్‌ ప్లాంట్‌ను కేవలం ప్లాంట్‌గానే చూడొద్దు-పవన్

వైజాగ్ స్టీల్‌ ప్లాంట్‌ను కేవలం ప్లాంట్‌గానే చూడొద్దు-పవన్

వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌ను కేవలం ఉక్కు కార్మాగారంగా మాత్రమే చూడొద్దని విజ్ఞప్తి చేశారు జనసేన అధినేత పవన్ కల్యాణ్... హస్తిన పర్యటనలో ఉన్న ఆయన.. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాతో సహా పలువురు కేంద్రమంత్రులను కలిశారు.. తన పర్యటనలో జరిగిన భేటీలపై మీడియాతో మాట్లాడిన పవన్ కల్యాణ్.. స్టీల్‌ ప్లాంట్‌ వ్యవహారంతో పాటు, రాష్ట్రంలో శాంతిభద్రతలు, దేవాలయాలపై దాడులను కూడా అమిత్‌షా దృష్టికి తీసుకెళ్లామన్నారు. వైజాగ్ స్టీల్‌ను కేవలం కర్మాగారంగానే చూడకుండా.. దాదాపు 32 మంది బలిదానాల తర్వాత స్టీల్ ప్లాంట్ వచ్చింది.. ఏపీ ప్రజల మనోభావాలను, ప్రజల ఆత్మగౌరాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలని.. సూక్ష్మ దృష్టితో చూడాలని కేంద్ర మంత్రులను కోరినట్టు తెలిపారు.  

ఇక, మార్చి 3 లేదా 4వ తేదీల్లో భారతీయ జనతా పార్టీ నేతలు, కేంద్ర మంత్రి అమిత్‌షాతో.. బీజేపీ-జనసేన రూట్‌ మ్యాప్‌పై చర్చిస్తామని.. ఆ తర్వాత తిరుపతి ఉప ఎన్నికలపై కూడా క్లారిటీ వస్తుందన్నారు. స్టీల్‌ ప్లాంట్‌పై రాత్రికి రాత్రే తీసుకున్న నిర్ణయం కాదన్న పవన్ కల్యాణ్.. ఎన్నో  సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమం నడుస్తోందని.. స్టీల్ ప్లాంట్‌పై కేంద్రమే నిర్ణయం తీసుకుంటుందన్నారు. స్టీల్‌ ప్లాంట్‌పై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేయాలనుకుంటే ఏదైనా చేయొచ్చన్నారు పవన్ కల్యాణ్. ఇక, స్టీల్‌ ప్లాంట్‌పై కేంద్రం నుంచి సానుకూల నిర్ణయమే ఉంటుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మీడియాతో పవన్ కల్యాణ్‌తో పాటు నాదెండ్ల మనోహర్ ఏం మాట్లాడారో తెలుసుకోవడానికి కింది వీడియోను క్లిక్ చేయండి..