'నివర్' తుఫాన్‌.. సహాయక చర్యలపై పవన్ విమర్శలు..

'నివర్' తుఫాన్‌.. సహాయక చర్యలపై పవన్ విమర్శలు..

నివర్‌ తుఫాన్ ఆంధ్రప్రదేశ్‌లో అతలాకుతలం చేసింది.. ముఖ్యంగా ఐదు జిల్లాల్లో భారీ నష్టాన్ని చవిచూడాల్సి వచ్చింది.. అయితే, ప్రభుత్వ సహాయక చర్యలపై విమర్శలు గుప్పించారు జనసేన అధినేత పవన్ కల్యాణ్.. నివర్ తుఫాన్‌ ప్రభావిత జిల్లాల జనసేన నేతలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించిన పవన్.. ఈ తుఫాన్ రైతాంగాన్ని కడగండ్ల పాల్జేసింది అని.. దాదాపు 12 లక్షల ఎకరాలకుపైగా పంట నష్టం వాటిల్లింది.. పశు సంపదపై ఆధారపడ్డ రైతులు తీవ్రంగా నష్టపోయారు అని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక, నివర్‌ తుఫాన్‌పై, ప్రకృతి విపత్తులతో రైతాంగానికి కలిగిన నష్టాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లనున్నట్టు వెల్లడించారు. పునరావాస కేంద్రాల్లో సౌకర్యాల లేమి... తుపాన్ ప్రభావిత ప్రాంతాల్లో తాగు నీరు కూడా అందని దుస్థితి బాధాకరమన్న పవన్... విపత్తుల సమయంలో ప్రభుత్వం కనీసం ప్రజల్ని అప్రమత్తం కూడా చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తుఫాన్‌ హెచ్చరిక కేంద్రాల్లో ఆధునిక పరిజ్ఞానం, వ్యవస్థలు ఉన్నా ప్రజలను అప్రమత్తం చేసే నాయకత్వం కరువైంది మండిపడ్డారు.. నివర్‌తో నష్టపోయిన రైతులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని డిమాండ్ చేశారు జనసేన అధినేత.