పాత వీడియోతో మంత్రి వెల్లంపల్లిని ఆడుకుంటున్న పవన్ అభిమానులు

పాత వీడియోతో మంత్రి వెల్లంపల్లిని ఆడుకుంటున్న పవన్ అభిమానులు

పాపం.. ఆ మంత్రిని గతం బూతంలా వెంటాడుతోంది.  అప్పట్లో ఆయన మాటే పదివేలు అనుకున్న సదరు మంత్రి ఇప్పుడు ఆయన్నే టార్గెట్‌ చేశారు. మంత్రి మరిచిపోయినా నెటిజన్లు మాత్రం గతాన్ని మర్చిపోలేదు.  ఇదిగో ఈయనే కదా అప్పట్లో మీరు బాబ్బాబు అన్నది.. అంటూ సెటైర్లు వేస్తున్నారు.   
 
2014లో తనకు మద్దతుగా ప్రచారం చేయమని వేడుకోలు!

పవన్‌ కల్యాణ్‌ తో కనిపిస్తున్న వ్యక్తి ఎవరో కాదు.. వెల్లంపల్లి శ్రీనివాస్‌. ప్రస్తుత ఏపీ దేవాదాయ శాఖ మంత్రి. 2014లో విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేశారు వెల్లంపల్లి. ఆ ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ కూటమికి జనసేన అధినేత మద్దతు ఇచ్చారు. ప్రచారానికి విజయవాడ వచ్చిన జనసేనాని పవన్‌ కల్యాణతో ఓ వీడియో తీయించుకున్నారు. వెల్లంపల్లి తనకు మద్దతుగా ఓ ముక్క చెప్పమని పవన్‌ వెంటపడి వేడుకున్నారు. ఆ వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో విపరీతంగా ట్రోల్‌ అవుతోంది.

అంతర్వేది ఘటనపై పవన్‌కు మాట్లాడే అర్హత లేదన్న వెల్లంపల్లి!

ఇంతకీ ఇప్పుడీ వీడియో బయటకు రావడానికి ట్రోల్‌ కావడానికి లెక్క ఉంది. అంతర్వేది రథం దగ్ధమైన ఘటనలో జనసేన అధ్యక్షడు పవన్‌ కల్యాణ్ ప్రభుత్వంపై చేసిన విమర్శలకు  వెల్లంపల్లి శ్రీనివాస్‌ కౌంటర్‌ ఇచ్చారు. రాజకీయ విమర్శలు చేస్తే సరిపోదని అనుకున్నారో ఏమో కానీ.. పవన్‌ కల్యాణ్‌ను అంతర్వేది ఘటనపై మాట్లాడటానికి అర్హత లేదని మాటల తూటాలు పేల్చారు.  సినిమాల్లో రోజుకో వేషం వేసినట్టు రాజకీయాలలో పవన్‌ రోజుకో మాట మాట్లాడుతున్నారు అన్నారు. ఎన్నికల ముందు తన పిల్లలు క్రిస్టియన్‌ అని.. ఎన్నికల  తర్వాత తాను హిందూ పరిరక్షకుడునని అంటున్నారని ధ్వజమెత్తారు మంత్రి. 

ఓ రేంజ్‌లో సోషల్‌ మీడియాలో ఆడుకుంటున్న జనసైనికులు!

వెల్లంపల్లి ఇలా అన్నారో లేదో జనసేన అభిమానులు తమ తవ్వకాల నుంచి ఓ వీడియోను బయటపెట్టి సోషల్‌ మీడియాలో పెట్టి ట్రోలింగ్‌  మొదలుపెట్టారు.
మీరా పవన్‌ను విమర్శింది అంటూ  ఓ రేంజ్‌లో ఆడుకుంటున్నారు. అధికార పార్టీలో మాత్రం వెల్లంపల్లి వైఖరిపై మరో చర్చ జరుగుతోందట. రెండున్నరేళ్ల తర్వాత కూడా మంత్రి పదవిని కాపాడుకునేందుకే పవన్‌పై ఈ రేంజ్‌లో విమర్శలు చేశారని కామెంట్స్‌ చేస్తున్నారు. 
 
2014లో బీజేపీ అభ్యర్థిగా వెల్లంపల్లి పోటీ!

వాస్తవానికి వెల్లంపల్లి రాజకీయ జీవితం చిరంజీవి ప్రజారాజ్యంతో మొదలైంది. 2009లో  బెజవాడ పశ్చిమ నుంచి పీఆర్పీ ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ సమయంలో యువరాజ్యం అధినేతగా పవన్‌ కల్యాణ్‌ ఉన్నారు. చిరంజీవి కాంగ్రెస్‌కు మద్దతివ్వడంతో ఆయనతోపాటు సాగారు వెల్లంపల్లి. రాష్ట్ర విభజన తర్వాత బీజేపీలో చేరి.. జనసేన, టీడీపీ, బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా విజయవాడ పశ్చిమ నుంచి 2014లో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు.  దీన్ని కూడా  ట్రోల్‌ చేస్తున్నారు.  గోదావరి పుష్కరాల్లో 29 మంది చనిపోయినప్పుడు, కృష్ణా పుష్కరాల్లో 40 గుడులు పడగొట్టినప్పుడు బీజేపీ ఎక్కడుంది? ఏం మాట్లాడింది అంటూ వెల్లంపల్లి  ఇప్పుడు నిలదీస్తున్నారు. మరి.. అప్పుడు బీజేపీలో ఉన్న తమరు ఎందుకు మాట్లాడలేదని  నెటిజన్లు మంత్రికి ప్రశ్నలు వేస్తున్నారు. 

వెల్లంపల్లి ఏదో అనుకుంటే మరేదో అయిందా?

పీఆర్పీ నుంచి రాజకీయ ప్రయాణం మొదలుపెట్టి ఇవాళ పవన్‌ను ఘాటైన పదజాలంతో విమర్శించడంతో జనసేన అభిమానులు అస్సలు ఉపేక్షించడం లేదు. పాత వీడియోలు బయటకు తీసి ఓ ఆట ఆడుకుంటున్నారు. అప్పుడు పవన్‌ కావాలి.. ఇప్పుడు పవన్‌ చెప్పే మాటలు అక్కర్లేదా అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. పాపం.. మంత్రిగా వెల్లంపల్లి ఏదో అనుకుంటే.. సోషల్‌ మీడియా దెబ్బకు మరేదో అవుతోందని చెవులు కొరుక్కుంటున్నారు. ఈ ఎపిసోడ్‌లో అడకత్తెరలో పోకచెక్కలా మారిపోయారని కామెంట్స్‌ చేస్తున్నారు.