తెలకపల్లి రవి: జనసేనాని కన్నా పవర్‌స్టార్‌దే పై చేయి?

తెలకపల్లి రవి: జనసేనాని కన్నా పవర్‌స్టార్‌దే పై చేయి?

తెలకపల్లి రవి

జనసేన అధినేత, పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌  తన పుట్టిన రోజు కొత్త వాతావరణంలో జరుపుకున్నారు. 27 చిత్రాలు అందులో కొన్ని బ్లాక్‌ బస్టర్లతో పవన్‌ సినిమా క్రేజు కొత్తేమీ కాదు. రాజకీయాల్లోనూ మొదట 2009లో ప్రజారాజ్యం 2014, 2019 ఎన్నికల్లో జనసేన ఆయనకు చాలా పాఠాలు నేర్పాయి. ప్రజారాజ్యం నాయకత్వం అన్న చిరంజీవిదైతే జనసేన పూర్తిగా తన సృష్టి. దాని తరపున 2014లో విభజితరాష్ట్ర తొలి ఎన్నికలో పవన్‌  పోటీ చేయకుండా చంద్రబాబు నాయకత్వంలోని ఎన్‌డిఎ కూటమిని బలపర్చారు.  ఎన్‌డిఎ సమావేశానికి కూడా ఆయనను ఆహ్వానించారు. అమరావతి రైతులల భూముల ఉద్యమం వంటి సమస్య తీసుకున్నా చాలా కాలం పాటు చంద్రబాబు మద్దతుదారుగానే వున్నారు. 2017 నుంచి క్రమంగా దూరమై కమ్యూనిస్టులతో కలసి పనిచేశారు. ఈ క్రమంలో సినిమాలు తీయడం తగ్గింది.రాజకీయాల్లోకి వెళ్లాక తీసిన సినిమాలు పెద్దగా విజయం సాదించలేదు, రాజకీయాలను తీసుకుంటే  యువతను బాగా ఆకర్షించినా ఆవేశంగా మాట్లాడిన జనసేన చివరకు పరాజయమే మూటకట్టుకుంది. ఎన్నికల సభల్లో పవన్‌ ప్రధానంగా జగన్ ‌పైన కేంద్రీకరిస్తున్నారనే విమర్శ వచ్చింది. చంద్రబాబు ఎలాగూ దెబ్బతిన్నారు గనక తాను ఇలా చేస్తున్నానంటూ ఆయన ఇచ్చిన వివరణ  సంతృప్తి పర్చలేదు. స్వయంగా రెండు చోట్ల ఓడిపోయిన పవన్‌ కళ్యాణ్‌ తర్వాత కొంత విరామం తీసుకుని బిజెపితో జట్టుకట్టారు.  బిజెపితో కలవడానికి ముందు పవన్‌ ఆధ్యాత్మికమైన మతపరమైన సంకేతాలు కూడా ఇచ్చే ప్రయత్నం చేశారు.  అంతకు ముందు తనే విమర్శించిన అమిత్‌ షాను పొగిడారు. 2019 తర్వాత బిజెపి అగ్రనాయకులో ప్రస్తుత అద్యక్షుడు జెపి నడ్డా మినహా మిగిలినవారు ఆయనను ఇంకా కలవలేదుగాని రాష్ట్ర నాయకులు గతంలో కన్నా క్ష్మీనారాయణ ఇప్పుడు సోమువీర్రాజు కూడా పవన్‌ జనాకర్షణపై చాలా ఆశలే  ప్రకటించారు. 

ఈ పొత్తు కుదిరిన తర్వాత కరోనా తాకిడితో రాజకీయ కార్యక్రమాలు తగ్గుముఖం పట్టడం ఒకటైతే పవన్‌ కళ్యాణ్‌ సినిమా రంగ పున: ప్రవేశం కొత్త ములపు. రాజకీయ విరామ సమయంలో ఫిలించేంబర్‌లో నా మన సినిమాలు పుస్తకావిష్కరణతోనే పవన్‌ మరోసారి చాలా సేపు అభిమానులను అలరించారు. ఆసభలో పరుచూరి గోపాలకృష్న ఎమ్జీఆర్‌లా సినిమాలు రాజకీయాలు రెండూ కొనసాగించాని  తనకు సూచించారు. ఎన్టీఆర్‌ ముఖ్యమంత్రిగావుండగానే బ్రహ్మర్షి విశ్వామిత్ర ప్రారంభించి తర్వాత పూర్తి చేశారు. రాజకీయాల్లోకి వచ్చాక కూడా ఆయన పలు చిత్రాలో నటించారు. వయసులో ఎన్టీఆర్‌ కన్నా ఎంతో చిన్నవాడైన పవన్‌ కళ్యాణ్‌ నటించడంలో పెద్ద ఆశ్చర్యం లేదు.తప్పూ లేదు. అందులోనూ అమ్మాయి ఆత్మగౌరవంపై  అమితాబ్‌  తాప్సీ మహోన్నతంగా నటించిన పింక్‌ వంటిచిత్రాన్ని దిల్‌రాజు లాంటి సమర్థుడైన నిర్మాత  తీయడం గనక ప్రజాదరణ సామాజిక సందేశం రెండూ అందుతాయి. తెలుగులో వకీల్‌సాబ్‌గా వస్తున్న ఆ చిత్రం కరోనా కారణంగా ఆలస్యమై ఈ రోజు మోషన్‌ పోస్టర్‌ విడుదలైంది. గాంధీ అంబేద్కర్‌ ఫోటోమధ్య లాయర్‌గా పవన్‌ శక్తివంతంగా కనిపిస్తున్నా చేగువేరా ఫోటో లేకపోవడం గమనించదగింది. ఇదేగాక క్రిష్‌ సురేందర్‌ రెడ్డి దర్శకత్వంలోనూ ఆయన నటిస్తారట. పవర్‌ స్టార్‌పూర్తిగా సినిమా రంగంలోకి వచ్చినట్టే. పుట్టినరోజు హంగామా ఇష్టం లేదని పవన్‌ అంటున్నా నెల రోజుల ముందునుంచి హాష్‌ట్యాగ్‌లను పాటులను విడుదల చేసి లైక్‌ లెక్క బాగా ప్రచారం చేశారు.కనుక కొన్ని శక్తులు కొందరు అభిమానులు ఈ విషయంలో ప్రత్యేకంగా ప్రమోట్‌ చేస్తున్నారన్నమాట.

ప్రస్తుతానికి జనసేనానిగా కన్నా పవర్‌స్టార్‌ పవనే పవర్‌ఫుల్‌గా కనిపిస్తున్నారు. ఈ పుట్టిన రోజున కుటుంబం పరిశ్రమ కూడా సంపూర్ణంగా ఆయనకు మద్దతు నిస్తున్నట్టు కనిపిస్తుంది. అన్న మెగాస్టార్‌ చిరంజీవి తమ్ముడి రాజకీయ జీవితానికి కూడా ఆశీస్సులు ఇచ్చినట్టుగా 2024లో బిజెపి జనసేన అధికారంలోకి రావాని ఆకాంక్షించారు. కొత్తఅద్యక్షుడు సోము వీర్రాజు ఎంపికలో సామాజిక సమీకరణా పాత్ర ఒకటైతే ఆయన పవన్‌కు ఇస్తున్న ప్రాధాన్యతలోనూ ఆ సోషల్‌ ఇంజనీరింగ్‌ స్పష్టం. ఇప్పటికే మీడియాలో  ఒక భాగం బిజెపి జనసేన వచ్చేస్తాయని ప్రచారం ఎత్తుకుంది. వైసీపీ ప్రభుత్వం మోడీ ప్రభుత్వంతో  అనుకూలంగా  వుంది గనక పవన్‌పై వారి దాడి గతంకన్నాతగ్గింది.పవన్‌  కూడా పూర్వపు ఆవేశం ల కాకుండా ఆచితూచి మాట్లాడవలసిన పరిస్తితి ఏర్పడిరది. ఆయన ఆకర్షణ నిజమైనా జాతీయంగా బిజెపి పెద్ద పాక పార్టీ ఎన్‌డిఎ నాయకస్థానం కూడా. ఈ పూర్వరంగంలో పవన్‌ కళ్యాణ్‌ను వచ్చే ఎన్నికలకుకూటమి నాయకుడుగా సిఎం ఫేస్‌గా ముందుకు తెస్తారా అనేది చూడవలసిందే. ఈ మాట ఇప్పటికి సూటిగా చెప్పిందిలేదు.తమిళనాడులో రజనీ కాంత్‌ విషయంలో బిజెపి ఎన్ని విన్యాసాలు చేస్తుందీ చూస్తున్నాం. అమరావతి రాజధాని మార్పు నుంచి అనేక అంశాలో ఆంధ్ర ప్రదేశ్‌ రాజకీయాలు హోరాహోరిగా నడుస్తున్నాయి.గతంలో పవన్‌ కళ్యాణ్‌జగన్‌ మీద కేంద్రీకరించినట్టే ఇప్పుడు  బిజెపివరకూ చూస్తే టిడిపి స్థానంపై దృష్టి పెట్టింది. మాటలు ఎన్ని చెప్పినా విభజన సమస్యలు, నిధుల మంజూరు ప్రత్యేకహోదా వంటివి నెరవేర్చలేదు.  ఇవన్నీ  గతంలో ఎలుగెత్తిన జనసేనాని ఇప్పుడే మౌనంగా వుంటే పొరబాటుసంకేతాలు తప్పవు. బిజెపి జట్టులో వాటిని మాట్లాడటం అసంభవం. పవన్‌ కళ్యాణ్‌ను రాజకీయాలో తీవ్రంగా తీసుకోవద్దనేవారున్నా  అది వాస్తవికత అనిపించుకోదు. అతిశయాలో మునిగితేలినా  ప్రయోజనం వుండదు.  పవర్‌ స్టార్‌గా పవన్‌ స్థానాన్ని రాబోయే సినిమాలు చెబితే జనసేనానిగా బిజెపి  మిత్ర సేనానిగా ఆయన రాజకీయ ప్రభావం ఆ తర్వాత తేలాలి.  ఎందుకంటే వైసీపీ టిడిపి మధ్య విభజితమైన  ఏపీ రాజకీయ దృశ్యం ఒక్కసారిగా మార్చడం తేలికైన పని కాదు.