సౌత్ లో కరోనా భయాన్ని పారద్రోలిన పవన్, ధనుష్‌!

సౌత్ లో కరోనా భయాన్ని పారద్రోలిన పవన్, ధనుష్‌!

ఉత్తరాదిన కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న నేపథ్యంలో కొన్ని ప్రాంతాలలో రాత్రి పూట కర్ఫ్యూను, వీకెండ్ లో లాక్ డౌన్ ను పెడుతున్నారు. కానీ సౌత్ లో మాత్రం పరిస్థితి అందుకు పూర్తి భిన్నంగా ఉంది. మరీ ముఖ్యంగా నిన్న రెండు తెలుగు రాష్ట్రాల్లో పవన్ కళ్యాణ్‌ 'వకీల్ సాబ్' విడుదలైన సందర్భంగా థియేటర్ల దగ్గర సందడి చూస్తే... జాతరను తలపించింది. వేలాది మంది జనం కరోనా భయం లేకుండా ఎంచక్కా థియేటర్లలో హంగామా సృష్టించారు. తెలంగాణలో గురువారం అర్థరాత్రి నుండే బెనిఫిష్ షోస్ ప్రదర్శించగా, ఆంధ్రాలో ప్రభుత్వ ఉత్తర్వులను అనుసరించి కేవలం తొలి రోజును ప్రతి థియేటర్ లోనూ నాలుగు షోస్ మాత్రమే వేశారు. అయినా కానీ ఫస్ట్ డే పవన్ కళ్యాణ్ 'వకీల్ సాబ్' ఏకంగా రూ. 41.35 కోట్ల రూపాయల గ్రాస్ ను వసూల్ చేసింది. 'దిల్' రాజు గతంలో తన బ్యానర్ లో స్టార్ హీరోలు ఎంతో మందితో సినిమాలు తీశాడు కానీ ఈ స్థాయి కలెక్షన్లను తొలి రోజునే రాబట్టిన మొదటి చిత్రంగా 'వకీల్ సాబ్' నిలిచి, వసూల్ సాబ్ గా మారిపోయింది.

ఇదే పరిస్థితి తమిళనాడులోనూ కనిపించింది. శుక్రవారం ధనుష్‌ నటించిన 'కర్ణన్' మూవీ విడుదలైంది. భారీ అంచనాలతో వచ్చిన ఈ సినిమా కూడా ధనుష్ కెరీర్ లో ఫస్ట్ డే ఓపెనింగ్స్ లో బెస్ట్ గా నిలిచింది. శుక్రవారం ఈ సినిమా 10.40 కోట్ల గ్రాస్ ను వసూలు చేసి, సరికొత్త రికార్డ్ సృష్టించిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇటు 'వకీల్ సాబ్', అటు 'కర్ణన్' ప్రదర్శితమౌతున్న థియేటర్లలో జనాలను చూస్తే... కరోనా సెకండ్ వేవ్ సౌత్ లో లేదేమో అనిపించిందని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. విశేషం ఏమంటే... కర్ణాటకలో ఈ రెండు సినిమాలు స్ట్రయిట్ గానే విడుదలయ్యాయి. కానీ అక్కడి థియేటర్లలో 50 శాతం ఆక్యుపెన్సీకి మాత్రమే అనుమతి ఉంది. అయితే... తమిళనాడులో మాత్రం శనివారం నుండి ఈ నిబంధన అమలు కాబోతోంది. సో... నిన్న వచ్చిన కలెక్షన్లు ఇవాళ 'కర్ణన్'కు రాకపోవచ్చు. కానీ తెలుగు రాష్ట్రాలలో మాత్రం ఇంకా నూరు శాతం ఆక్యుపెన్సీతోనే థియేటర్లు నడుస్తుండటం విశేషం.  ఏదేమైనా ఈ స్టార్ హీరోల అభిమానులు కరోనాని సైతం లెక్క చేయకుండా తమ హీరో సినిమాను మొదటి రోజే చూడటానికి ప్రాధాన్యమిచ్చారన్నది వాస్తవం.