లంచాలకు రశీదు ఇస్తారా..?

లంచాలకు రశీదు ఇస్తారా..?

ప్రజా పోరాట యాత్రలో భాగంగా విజయనగరం జిల్లా సాలూరులో పర్యటిస్తోన్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రాష్ట్రంలో 17వేల కిలోమీటర్లు రోడ్లు వేశామంటున్న మంత్రి నారాలోకేశ్ సాలూరులో మాత్రం ఎందుకు బైపాస్ వేయలేదని పవన్ ప్రశ్నించారు. సచివాలయంలో కూర్చొన్న లోకేశ్ కేంద్రం వేసిన రోడ్లను తాము వేశామని చెప్పుకుంటున్నారని ఆరోపించారు. అవినీతి ఆరోపణలను ముఖ్యమంత్రి నిరూపించాలని..లంచాలకు ఎవరైనా రశీదు ఇస్తారా..? అని ప్రశ్నించారు...

టీడీపీ నాయకులు అంగన్‌వాడీ వర్కర్స్ దగ్గర లక్షల రూపాయాలు లంచాలు తీసుకుంటున్నారని.. అక్రమ మైనింగ్ చేస్తున్నారని.. కానీ వీటిని ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడం లేదని పవన్ దుయ్యబట్టారు. అక్రమ మైనింగ్ వల్ల రైతులు నష్టపోతున్నారని.. ప్రజాభిప్రాయ సేకరణ లేకుండా చేస్తున్న మైనింగ్‌‌పై ఉద్యమిస్తాననన్నారు.  ఒడిషా, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలతో ముడిపడివున్న నియోజకవర్గం సాలూరని.. కానీ ఇక్కడ సరైన రోడ్లు లేవని.. ఆర్టీసీ డీపో కూడా మూసివేతకు సిద్ధమైందని జనసేనాని ఆరోపించారు. టీడీపీ నేత భంజ్‌దేవ్ నదీ జలాలను తన రొయ్యల చెరువులకు మళ్లీంచుకుంటున్నారని.. రొయ్యల చెరువుల నుంచి వెలువడుతున్న వ్యర్థనీటిని పొలాలకు వదులుతున్నారని పవన్ అన్నారు. అతను గిరిజనేతరుడైనా . గిరిజనుడని సర్టిఫికెట్ ఇచ్చారని.. ఇది ఆ తెగను మోసం చేయడమేనని ఆరోపించారు.