రామతీర్థం కోసం  కమిటీ… ప్రకటించిన పవన్ కళ్యాణ్ !

 రామతీర్థం కోసం  కమిటీ… ప్రకటించిన పవన్ కళ్యాణ్ !

రామతీర్థం ఘటనలో  బి.జె.పి.తో కలసి పోరాటం చేయడానికి కమిటీని పవన్ కళ్యాణ్ ప్రకటించారు. పార్టీ ప్రధాన కార్యదర్శి  టి.శివశంకర్  నేతృత్వం లో నలుగురు సభ్యులు కమిటీని ఆయన ప్రకటించారు. సభ్యులుగా పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యురాలు  పాలవలస యశస్విని,  పార్టీ ఉత్తరాంధ్ర ప్రాంతీయ కమిటీ సభ్యులు  గడసాల అప్పారావు, డాక్టర్  బొడ్డేపల్లి రఘులు ఉన్నారు. ఇక ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ రామతీర్థంలో ఘటన జరిగి వారాలు గడుస్తున్నా ఈ కేసులో ఇంత వరకు ఎటువంటి పురోగతి లేదని అన్నారు. తమకు స్వేచ్ఛను ఇస్తే ఎటువంటి జఠిలమైన కేసునైనా  పరిష్కరిస్తామని పోలీసు అధికారులు తరచూ ఆఫ్ ది రికార్డుగా చెబుతుంటారని ఆయన అన్నారు. మరి ఈ కేసులో పోలీసులకు పూర్తి స్థాయి స్వేచ్ఛను ఇవ్వలేదని అనుమానించవలసిన పరిస్థితులు ఏర్పడుతున్నాయని పవన్ అన్నారు. ఈ కేసులో సత్వర న్యాయం జరపడానికి బి.జె.పి. రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు బృందంతో కలసి ఈ కమిటీ పని చేస్తుందని పవన్ పేర్కొన్నారు. జనసేన కార్యకర్తలను అవసరమైన సమయాలలో సమాయత్తం చేస్తూ పోరాటంలో పాల్గొంటారని ఆయన అన్నారు.