పార్వతీపురం వైసీపీ ఎమ్మెల్యే రూటు మార్చేశారా?

పార్వతీపురం వైసీపీ ఎమ్మెల్యే రూటు మార్చేశారా?

నియోజకవర్గ ప్రజలంతా నావారే అన్నారు. ఎవరికి ఏం కావాలన్నా చిటికెలో చేసిపెడతానని హామీ ఇచ్చారు. కానీ.. ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత రూటు మార్చేశారట. పైకి చెప్పేదొకటి.. చేసేది మరొకటి అట. ఇంతకీ ఎవరా నేత? ఏమా కథ? 
 
సొంతవర్గానికి కొమ్ము కాస్తోన్న ఎమ్మెల్యే జోగారావు?

విజయనగరం జిల్లాలో ఏకైక SC రిజర్వ్డ్‌ నియోజకవర్గం పార్వతీపురం. బ్రిటీష్‌ కాలం నుంచీ ఈ ప్రాంతానికి పేరుంది. శ్రీకాకుళం నుంచి విజయనగరం  జిల్లాలో  కలిసిన తర్వాత డివిజన్‌ కేంద్రంగా.. ITDA కి  సెంటర్‌గా ఉంది. అంతటి ముఖ్యమైన పార్వతీపురం నియోజకవర్గానికి 2019లో ఇంఛార్జ్‌గా ఉన్న ప్రసన్నకుమార్‌ను కాదని.. కాంగ్రెస్‌ నుంచి వచ్చిన అలజంగి జోగారావుకు టికెట్‌ ఇచ్చారు. ఫ్యాన్‌ గాలిలో ఎమ్మెల్యే అయ్యారు. ఇంతవరకూ బాగానే ఉన్నా.. శాసనసభ్యుడైన నాటి నుంచీ సొంత వర్గానికే  జోగారావు కొమ్ము కాస్తున్నారని కేడర్‌ ఆరోపిస్తోంది. 
 
మాట వినేవారికే డివిజన్‌లో పోస్టింగ్‌లు ఇప్పిస్తున్నారా?

పైగా పక్క నియోజకవర్గం ఎమ్మెల్యే, డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణితో ఎమ్మెల్యే జోగారావుకు అస్సలు పడటం లేదట. ఈ వివాదం ఇలా ఉండగానే.. ఆయన ధోరణి ఏకపక్షంగా ఉంటోందన్న విమర్శలు అధికార పార్టీలోనే జోరందుకుంటున్నాయి. అధికారులంతా తన కనుసన్నల్లోనే నడవాలని ఆజ్ఞలు ఇస్తారని.. తన మాట వినేవారికే పార్వతీపురం డివిజన్‌ పరిధిలో పోస్టింగ్‌లు ఇప్పిస్తున్నారని వైసీపీ వర్గాల్లో వినిపిస్తున్న టాక్‌.
 
వాలంటీర్లు, అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగాల నియామకాల్లోనూ పైచేయి?

ఎమ్మెల్యేగా గెలిచిన నాటి నుంచి  ఎమ్మెల్యే భూ వివాదాల్లో తల దూరుస్తున్నారట. ఎవరికైనా పోస్టింగ్‌లు వేయాలన్నా.. జిల్లా మంత్రుల మాట కాదని.. తనకున్న పరిచయాలతో పనులు కానిచ్చేస్తున్నారట. వాలంటీర్లు, అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగుల నియామకం వరకూ ఎమ్మెల్యే చెప్పిందే చేయాలట.  అవినీతి ఆరోపణలు ఉన్న ఓ ఉద్యోగి బదిలీ విషయంలో హోంశాఖ బ్రేక్‌ వెయ్యాల్సి వచ్చిందని సమాచారం.
 
జగదీష్‌ వస్తే ఆధిపత్యానికి గండి పడుతుందని భయం?

టీడీపీలో బలమైన నేతగా ఉన్న MLC ద్వారపురెడ్డి జగదీష్‌ను సైతం  YCPలో చేరకుండా ఎమ్మెల్యే జోగారావే అడ్డుకుంటున్నట్లు స్థానికంగా చెవులు కొరుక్కుంటున్నారు. జగదీష్‌ వస్తే నియోజకవర్గంలో తన ఆధిపత్యానికి గండి పడుతుందని భయపడుతున్నారట. మొత్తానికి పార్వతీపురంలో ఎమ్మెల్ జోగారావు తీరుపై అటు ప్రజలు ఇటు సొంత పార్టీవారు రకరకాలుగా చర్చించుకుంటున్నారు.