వైసీపీలో ఆ కీలక నేతకు పార్టీ షాక్ ఇవ్వనుందా?

వైసీపీలో ఆ కీలక నేతకు పార్టీ షాక్ ఇవ్వనుందా?

రాజకీయాలు అందరికీ కలిసిరావు. కొందరికైతే.. మరీను.. ఐరన్‌ లెగ్‌ కంటే అధ్వాన్నం. ప్రకాశం జిల్లాలో పాపం అలాంటి నేత ఒకరు ఉన్నారు.  ఆయన్ను దురదృష్టం  రాకెట్‌లా వెంటాడుతోంది. అవకాశం చేతిదాకా వచ్చి వెళ్లిపోతోంది.  ఇప్పటికే ఓసారి దెబ్బతిన్న సదరు నేతను ఇప్పుడు మరో గండం వెంటాడుతోంది.
 
రామనాథం బాబుకు మళ్లీ పదవీ గండమేనా?

ప్రకాశం జిల్లా పర్చూరు అధికార పార్టీ రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. నియోజక వర్గంలో నాయకుడిగా ఎప్పుడు ఎవరుంటారో తెలియని పరిస్థితి నెలకొంది. ఏడాదిగా పర్చూరు నియోజకవర్గంలో వైసీపీ ఇంఛార్జ్ పదవి చేపట్టిన వారి పరిస్థితి దినదిన గండంగా ఉందని టాక్. ప్రస్తుత ఇంఛార్జ్‌ రావి రామనాథం బాబు పరిస్థితి కూడా అలాగే ఉందట. 
 
2019లో ఇంఛార్జ్‌గా ఉన్నా పర్చూరు టికెట్‌ రాలేదు!

గతంలో పలు వ్యాపారాలు చేసిన రామనాథం బాబు రాజకీయాల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు వైసీపీలో చేరారు. పర్చూరు నియోజకవర్గ ఇంఛార్జ్‌గా ఉన్నా 2019 ఎన్నికల్లో వైసీపీ టికెట్‌ ఇవ్వలేదు. సీనియర్ నేత దగ్గుబాటి వెంకటేశ్వరరావుకి టిక్కెట్ లభించింది. ఎంత సేవ చేసినా సీటు ఇవ్వలేదని అప్పటికప్పుడు మనస్తాపం చెందిన రామనాథం బాబు ఎన్నికల సమయంలో టీడీపీలో చేరారు. ఆ ఎన్నికల్లో దగ్గుబాటి ఓడిపోవడం.. వైసీపీ అధికారంలోకి వచ్చినా ఆయన పార్టీకి దూరం కావడం చకచకా జరిగిపోయింది. ఇదే సమయంలో రామనాథంబాబు తిరిగి వైసీపీ గూటికి వచ్చేశారు. ఎవరూ లేని పర్చూరు బాధ్యతలను  మరోసారి ఆయనకే అప్పగించారు. 
 
ఆమంచి వస్తారన్న ప్రచారంతో రామనాథం ఇబ్బంది పడుతున్నారా?

ప్రస్తుతం నియోజకవర్గంలో ఆయనదే హవా. అయినా ఇటీవల జరుగుతున్న ప్రచారంలో రామనాథం బాబుకు పదవీ గండం తప్పదనే కామెంట్స్‌ వినిపిస్తున్నాయి. చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్‌కు పర్చూరు నియోజకవర్గ బాధ్యతలు అప్పగిస్తారని ప్రచారం జరుగుతోంది. ఆమంచి ప్రస్తుతం చీరాల ఇంఛార్జ్‌గా ఉన్నారు. అక్కడ ఎమ్మెల్యే కరణం బలరాం వైసీపీకి అనుకూలంగా ఉండటంతో.. ఆమంచిని పర్చూరుకు పంపే ఏర్పాట్లు చేస్తోంది అధిష్ఠానం. దీనికితోడు ఆమంచి అభిమానులు ఇటీవల పర్చూరు నియోజక వర్గంలో ఆయనకు స్వాగతం పలుకుతూ ఫ్లెక్సీలు కూడా వేశారు. దీంతో పర్చూరుకు ఆమంచి రాక ఖాయంగా కనిపిస్తోంది. అధికార పార్టీలో జరుగుతున్న పరిణామాలు మరోసారి రామనాథం బాబుకి ఇబ్బందిగా మారాయట. 
 
వైసీపీలో మళ్లీ చేదు అనుభవమేనా?

ఒకవేళ ఆమంచి వస్తే.. రామనాథంబాబుకు వైసీపీలో మరోసారి చేదు అనుభవం తప్పదని అనుకుంటున్నారు. ఈ విషయం తెలిసినప్పటి నుంచీ  ఆయన అసంతృప్తితో ఉన్నారట. గతంలో ఎన్నికలకు ముందు వరకూ ఊరించి చివర్లో దగ్గుబాటికి సీటు ఇచ్చి హ్యాండ్‌ ఇచ్చారు.  టైం బాగుండి మళ్లీ బాధ్యతలు దొరికాయని సంబరపడుతుంటే మళ్లీ  ఆమంచి రూపంలో మరో గండం ఎదురవుతోందని వాపోతున్నారట. ఇప్పుడ ఆమంచి వస్తే అలాగే చేస్తారని అంటున్నారు. దీంతో రామనాథంబాబు రాజకీయ భవిష్యత్‌ ఏంటనే చర్చ మొదలైంది.