మాజీ మంత్రి దేవినేని ఉమాకు షాక్‌ ఇచ్చిన పంచాయతీ ఫలితాలు!

మాజీ మంత్రి దేవినేని ఉమాకు షాక్‌ ఇచ్చిన పంచాయతీ ఫలితాలు!

ఆయనో మాజీ మంత్రి. నిత్యం ప్రభుత్వంపై నిప్పులు చెరుగుతారు. అలాంటి నాయకుడికి పంచాయతీ ఫలితాలు పెద్ద చిక్కు తెచ్చిపెట్టాయి. ఇదంతా అధికారపక్ష ఆర్థిక విజయం అని ఆయన సర్ది చెప్పుకొంటున్నా.. నాలుగు గోడల మధ్య వ్యథ మరోలా ఉందట. ఇంతకీ ఎవరా నేత? ఏమా కథ? 

దేవినేనికి మింగుడు పడని మైలవరం పంచాయతీ ఫలితాలు!

అధికార ప్రతిపక్షాల సవాళ్లు ప్రతి సవాళ్లతో ఏపీలో పంచాయతీ పోరుకు ఈ దఫా అత్యధిక ప్రాధాన్యం ఏర్పడింది. ముఖ్యంగా కొందరు మంత్రులు.. మరికొందరు మాజీ మంత్రుల నియోజకవర్గాలపై ప్రత్యేక చర్చ జరుగుతుంది. అందులో మాజీ మంత్రి దేవినేని ఉమా నియోజకవర్గం మైలవరం కూడా ఉంది. రాష్ట్రంలో ప్రస్తుత ప్రభుత్వం పని అయిపోయిందని నిత్యం నిరసన గళం వినిపించే దేవినేనికి.. ఇంట్లో ఫలితాలు మాత్రం మింగుడు పడడం లేదట.

మైలవరంలో 48 పంచాయతీలలో 44 చోట్ల వైసీపీ విజయం!
పల్లె ఫలితాలపై దేవినేని కలత చెందారా? 

మొదటి విడత ఎన్నికల్లో భాగంగా మైలవరం నియోజవకర్గంలోని 48 పంచాయతీలకు ఎలక్షన్స్‌ జరిగాయి. వాటిలో 44 చోట్ల అధికారపక్షమే విజయం సాధించింది. కేవలం మూడుచోట్ల మాత్రమే టీడీపీ మద్దతుదారులు గెలిచారు. మరో పంచాయతీని ఇతరులు దక్కించుకున్నారు. దీంతో దేవినేని సొంత నియోజకవర్గం ఫలితాలపై ఇంటా బయటా చర్చ మొదలైంది. అధికార పక్షంలోని ముఖ్యనేతలు సైతం ఇవిగో దేవినేని నియోజకవర్గంలోని ఎన్నికల ఫలితాలు అని పదేపదే గుర్తు చేస్తున్నారు. సొంత నియోజకవర్గంలోనే పట్టుమని 10 పంచాయతీలు గెలిపించుకోలేని నాయకుడు.. నిత్యం బయట రచ్చ చేస్తారు అని సెటైర్లు వేస్తున్నారట. ఈ ఫలితాలపై దేవినేని సైతం కలత చెందారని తెలుస్తోంది. 

ఎమ్మెల్యే వసంత వల్లే విజయం వరించిందని వైసీపీ వాదన!

అధికారపక్షంతో పాటు.. సొంత పక్షంలోని నాయకులు చేస్తోన్న విమర్శలపై ఇప్పటికే కౌంటర్ మొదలు పెట్టింది దేవినేని వర్గం. మైలవరం విషయంలో ప్రభుత్వ పెద్దలు స్వయంగా మానిటర్ చేశారని.. ఆర్థిక వనరులు పుష్కలంగా ఇచ్చి ఎన్నికలు నిర్వహించారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఉమాను ఓడించడానికే అన్ని సమకూర్చారు అని ఆయన వర్గం చెబుతోంది. నియోజకవర్గంలో పంచాయతీ ఎన్నికలను ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్‌ చాలా సీరియస్‌గా తీసుకుని పని చేశారన్నది వైసీపీ నేతలు చెప్పేమాట. అధిష్ఠానం నుంచి ఆర్థిక మద్దతు లేదని..  ఎమ్మెల్యే పట్టుదలవల్లే ఈ స్థాయి విజయం వచ్చిందని ప్రచారం చేస్తున్నారు.  

టీడీపీ ఆఫీస్‌లో నిర్వహించిన సంబరాల్లో ఉమా పాల్గొనడంపై విమర్శలు!

మంత్రి కొడాలి నానిపై సవాల్ అంటూ కొద్దిరోజుల క్రితం గొల్లపూడిలో హల్‌చల్ చేసిన దేవినేనికి.... ఈ ఫలితాలు పెద్ద దెబ్బగా విశ్లేషిస్తున్నారు ఇంకొందరు. చంద్రబాబుతో భోగిమంటలు వేయించి పెద్ద ప్రోగ్రాం చేసినా పరిటాల లాంటి చోటే టీడీపీ ఓడిపోయిందని.. తమ నేత ఓటమి లెక్కేంటని ఉమా వర్గం నేతలు వాదిస్తున్నారు. మైలవరంలో అధికార పార్టీకి దీటుగా ఆర్థిక వెసులుబాటు లేకనే తాము ఓడిపోయామని చెబుతున్నారట. ఇవి ఆర్థిక వనరులు తెచ్చిన విజయాలుగా ఎదురుదాడి చేస్తున్నా.. చర్చ మాత్రం అందుకు బిన్నంగా సాగుతోంది. ఫలితాల రోజున ప్రాణాలొడ్డి గెలిచామని ఈ మాజీ మంత్రి కేంద్ర పార్టీ కార్యాలయంలో చేసిన ప్రకటనను జోడించి మరికొందరు ట్రోల్ చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో ఫలితాలు ఇలా ఉంటే.. పార్టీ కార్యాలయంలో నిర్వహించిన సంబరాల్లో ఉమా పాల్గొనడం పైనా విమర్శలు వినిపిస్తున్నాయట. ఏది ఏమైనా పంచాయతీ ఫలితాలు దేవినేనిని డిఫెన్స్‌లో పడేశాయనే కామెంట్స్‌ జోరందుకున్నాయి.