రివ్యూ: పలాస 1978 

రివ్యూ: పలాస 1978 

నటీనటులు: రక్షిత్, నక్షత్ర, రఘు కుంచె, తిరువీర్, జనార్దన్, లక్ష్మణ్, కృతి, జగదీష్ తదితరులు 

మ్యూజిక్: రఘుకుంచె 

సినిమాటోగ్రఫీ: అరుల్ 

నిర్మాత: ధ్యాన్ అట్లూరి 

దర్శకత్వం: కరుణ కుమార్ 

సినిమా అంటే వినోదం. ఈ వినోద రంగంలో ఎలాంటి మార్పులు వస్తున్నాయో చెప్పక్కర్లేదు.  సినిమాను కేవలం వినోద ప్రాధాన్యతగా మాత్రమే కాకుండా, దానిని సామాజిక అంశాలతో కూడిన సినిమాలు కూడా తీస్తున్నారు.  సామాజిక అంశాలతో కూడిన సినిమాలు తీస్తున్నారు.  ఇలా సామాజిక అంశాల వచ్చే సినిమాలు ఇండస్ట్రీలో మంచి విజయాలు సాధిస్తున్నాయి.  అలా వచ్చిన సినిమానే పలాస 1978.  ఈరోజు రిలీజైన ఈ సినిమా ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుందో తెలుసుకుందాం.  

కథ

పలాసలో ఓ కళాకారుల కుటుంబానికి చెందిన అన్నదమ్ములు రక్షిత్, తిరువీర్ ల మధ్య ఎలాంటి గొడవలు లేకుండా అన్యోన్యతగా ఉంటారు.  కళను జీవనంగా చేసుకొని జీవితం సాగిస్తుంటారు.  అయితే, అదే పలాసలో మరో అన్నదమ్ముల కుటుంబం ఉన్నది.  పెద్ద షావుకారు జనార్దన్, చిన్న షావుకారు రఘు కుంచెల మధ్య పచ్చగడ్డి వేస్తె భగ్గుమనేలా ఉంటుంది. వీరిద్దరి ఆధిపత్య పోరు, రాజకీయాలకు  అన్నదమ్ములు రక్షిత్, తిరువీర్ లను పావులుగా వాడుకుంటారు.  షావుకారు అన్నదమ్ముల మధ్య జరిగిన పోరులో ఈ కళాకారుల కుటుంబం ఎలాంటి ఇబ్బందులు పడింది ? ఆ ఇబ్బందుల నుంచి బయటపడ్డారాలేదా అన్నది సినిమా కథ.  

విశ్లేషణ: 

అన్నదమ్ముల అనుబంధం.. ఆధిపత్య పోరు... పెద్దమనుషులు ఓ వర్గం వ్యక్తులు ఊడిగం చేస్తూ బతకాలి... ఇలాంటి అంశాలతో గతంతో సినిమాలు చాలా వచ్చాయి.  పలాస సినిమా ఆ కోణంలో ఉన్నప్పటికీ దాన్ని దర్శకుడు తీసిన విధానం చూపించిన విధానం కొత్తగా అనిపిస్తుంది.  విషయాన్ని సూటిగా చెప్తూ ప్రశ్నించే విధానం ఆకట్టుకుంటుంది.  1978 కాలం నాటి పరిస్థితులను తెరపై  ఆవిష్కరించి అప్పటి కాలంలో శ్రీకాకుళం ప్రాంతం ఏ విధంగా ఉండేదో కళ్ళకు కట్టినట్టుగా చూపించారు.  షావుకారు అన్నదమ్ముల ఆధిపత్య పోరులో కళాకారుల కుటుంబం నుంచి వచ్చిన ఇద్దరు అన్నదమ్ములు ఎలా ఇరుక్కు పోయారు.  రౌడీలుగా ఎలా మారారు.. అనే విషయాలను తెరపై చూపించారు.  ఫస్ట్ హాఫ్ పలాస భాష యాసలతో హాస్యాన్ని జొప్పించి సరదాగా నడిపిస్తే, సెకండ్ హాఫ్ లో అన్నదమ్ముల మధ్య వైరం వచ్చి విడిపోయిన తరువాత ఏం జరిగిందనే విషయాలను చూపించారు.  సినిమాకు క్లైమాక్స్ కొంతమేర ప్లస్ అయ్యింది.  హీరో తీసుకునే నిర్ణయం ప్రతి ఒక్కరికి షాక్ ఇస్తుంది.  

నటీనటుల పనితీరు: 

సహజత్వానికి దగ్గరగా ఉండే సినిమా కాబట్టి ఇందులో పాత్రలు తప్పించి నటీనటులు కనిపించరు. మోహన్ రావు పాత్రలో రక్షిత్ సహజంగా నటించారు. అలానే రంగారావు పాత్రలో తిరువీర్ కూడా అద్భుతంగా నటించి మెప్పించారు.  రఘు కుంచె మిగతా నటీనటులు సైతం మెప్పించే విధంగా నటించారు.  

సాంకేతిక వర్గం పనితీరు: 

దర్శకుడు కరుణ కుమార్ కు ఇది మొదటి సినిమా.  అయినప్పటికీ కూడా ఈ సినిమా ఆకట్టుకుంది.  కథనాలను నడిపించిన తీరు సూపర్ అని చెప్పాలి.  ముఖ్యంగా రఘుకుంచె నేపధ్య సంగీతం మెచ్చుకునే విధంగా ఉన్నది.   అరుల్ ఫొటోగ్రఫీ అక్కడక్కడా మెప్పించింది.  

పాజిటివ్ పాయింట్స్: 

కథ, 

కథనాలు, 

నటీనటులు 

మైనస్ పాయింట్స్: 

యాక్షన్ 

చివరిగా: పలాస 1978: సహజత్వానికి దగ్గరగా ఉన్న సినిమా...