ఇమ్రాన్‌ రాజీనామా చేయాలి..!

ఇమ్రాన్‌ రాజీనామా చేయాలి..!

పాకిస్థాన్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌కు పొలిటికల్‌ హీట్ తాకుతోంది.. పాక్‌లోని గుజ్రన్‌వాలా భారీ ప్రభుత్వ వ్యతిరేక ప్రదర్శనకు వేదికైంది. రోజురోజుకు విపక్ష కార్యకర్తలపై పెరుగుతున్న మిలటరీ వేధింపులు, ఇమ్రాన్‌ ఖాన్‌ ప్రభుత్వ పాలనా వైఫల్యం, పెరుగుతున్న విదేశీ ప్రభుత్వాల పెత్తనం తదితర అంశాలను ప్రస్తావిస్తూ.. ఈ ప్రదర్శన జరిగింది. ఇందులో పాకిస్థాన్ ముస్లిం లీగ్ నవాజ్‌ పార్టీ, పీపీపీ పార్టీ సహా పదకొండు విపక్ష పార్టీల సభ్యులు హాజరయ్యారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటును మరింత యునైటెడ్‌గా ఉంచడానికే ఈప్రదర్శన నిర్వహించినట్లు నేతలు తెలిపారు. ప్రధానంగా ప్రధాని పదవికి ఇమ్రాన్‌ఖాన్ రాజీనామా చేయాలని నినదించారు.

అయితే, ఈ భారీ ప్రదర్శనకు హాజరైన కార్యకర్తలు.. మాస్కులు ధరించకపోవడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటికే కరోనా విజృంభణతో పాకిస్థాన్ సతమతమవుతోంది. ఈపరిస్థితుల్లో ఇంత భారీ ర్యాలీలో మాస్కులు లేకుండా జనం హాజరు కావడంతో.. వైరస్ విస్తరణ మరింత పెరుగుతుందన్న ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అసలే పుట్టెడు కష్టాల్లో ఉన్న పాకిస్థాన్‌.. వైరస్ వ్యాప్తిని అడ్డుకోగలదా? అన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు.. పాకిస్థాన్‌ మాజీ ప్రధాని ననవాజ్‌ షరీఫ్ అక్క‌డి ప్ర‌భుత్వంపై విమర్శలు గుప్పించారు. పాకిస్థాన్‌‌ ప్రభుత్వంపైన‌, ఆర్మీ చీఫ్‌ జనరల్‌ జావేద్‌ బజ్వాపైన తీవ్ర‌స్థాయిలో విరుచుకుపడ్డారు. ప్ర‌స్తుతం లండ‌న్‌లో ఉన్న న‌వాజ్ ష‌రీఫ్..‌ ఇమ్రాన్‌ఖాన్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రతిపక్షాలన్నీ క‌లిసి గుజ్రాన్‌వాలాలో నిర్వహిస్తున్న ఆందోళనలో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడారు. 2018 ఎన్నికల సమయంలో బజ్వా న్యాయవ్యవస్థపై ఒత్తిడి తెచ్చి మరీ ఇమ్రాన్‌ఖాన్‌కు అధికారం కట్టబెట్టాడ‌ని ఆరోపించారు. జావేద్‌ బజ్వా.. మీరు మీ స్వార్థ ప్రయోజనాల కోసం సక్రమంగా పని చేస్తున్న మా ప్రభుత్వాన్ని కూలదోశారు. మీకు నచ్చిన వారికి ప్ర‌ధాని ప‌ద‌వి కట్టబెట్టారు అంటూ మండిపడ్డారు షరీఫ్‌.