పాక్‌లో విమాన ప్రమాదం.. ఒక్కరూ మిగల్లేదు..!

పాక్‌లో విమాన ప్రమాదం.. ఒక్కరూ మిగల్లేదు..!

పాకిస్థాన్‌లో ఘోర విమాన ప్రమాదం జరిగింది. కరాచీలోని జిన్నా అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలోని పాకిస్తాన్‌ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం కూలిపోయింది. విమానాశ్రయానికి నాలుగు కిలోమీటర్ల దూరంలో జనావాసాల మధ్య విమానం కూలిపోవడంతో నష్టం భారీగా సంభవించింది. ప్రమాదం జరిగే సమయంలో విమానంలో 90 మంది ప్రయాణికులు, ఎనిమిది మంది సిబ్బంది ఉన్నారు. మొత్తంగా 107 మంది చనిపోయారని తెలుస్తోంది. జనావాసాల మధ్య ఈ విమానం కుప్పకూలిపోవడంతో మృతుల సంఖ్య మరింత పెరిగే ప్రమాదముంది. ఇప్పటివరకు 37 మృతదేహాలను ఆసుపత్రులకు తరలించినట్లు సింధ్ ఆరోగ్య మంత్రి అజ్రా పెచుహో తెలిపారు. స్థానిక మీడియా నివేదికల ప్రకారం, విమానం దాని రెండు ఇంజన్లను కోల్పోయింది. ఇంజిన్‌లో మంటలు చేలరేగినట్టు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. 

పాకిస్థాన్‌ ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఏ-320 విమానం లాహోర్‌ నుంచి కరాచీకి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. విమానం కూలిపోగానే, ఆర్మీ, పోలీసు బృందాలు అక్కడికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టాయి. ఈ ఘటనతో కరాచీలోని అన్ని పెద్ద ఆస్పత్రుల్లో ఆరోగ్యశాఖ ఎమర్జెన్సీ ప్రకటించింది. ఈ విమానం జనావాసాల మధ్య కుప్పకూలడంతో చాలా ఇళ్లు దెబ్బతిన్నాయి. విమానం కూలిపోయిన ప్రదేశంలో దట్టమైన పొగలు అలముకున్నాయి. మరో నిమిషంలో విమానం ల్యాండింగ్‌ కావాల్సి ఉండగా.. అంతలోనే ప్రమాదం జరిగింది. విమాన ప్రమాదంపై పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. సహాయక చర్యల్ని పర్యవేక్షించేందుకు ఘటనా స్థలానికి వెళ్లిన పాక్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌లైన్స్‌ సీఈవో అర్షద్‌ మాలిక్‌తో ఎప్పటికప్పుడు వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ ఘటనపై దర్యాప్తుకు ఆదేశించినట్టు ట్విటర్‌లో పేర్కొన్నారు. మృతులకు తన సంతాపం తెలిపారు. ఇటు భారత ప్రధాని నరేంద్ర మోడీ కూడా పాక్ విమాన ప్రమాదంపై సంతాపాన్ని వ్యక్తంచేస్తూ ట్వీట్ చేశారు. రంజాన్‌ వేడుకలకు పాకిస్థాన్ సిద్ధమవుతున్న సమయంలో ఈ ప్రమాదం జరగడంతో విషాదం నెలకొంది.