బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్ కోడ్ నేమ్ ...?!

బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్ కోడ్ నేమ్ ...?!

భారత్ లో జరిగిన పుల్వామా దాడికి ప్రతీకారం తీర్చుకొనేందుకు భారతీయ వాయు సేన పాకిస్థాన్ లోని బాలాకోట్ లో వైమానిక దాడులు జరిపింది. ఈ ఎయిర్ స్ట్రైక్ లో ఉగ్రవాదుల స్థావరాలను లక్ష్యంగా చేసుకున్నారు. అంతా దీనిని బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్ అని పిలుస్తున్నారు. కానీ ఇప్పుడు దీనిపై సీనియర్ రక్షణ వర్గాలు ఒక కీలక సమాచారం తెలిపాయి. ఈ దాడుల గోపనీయతను పాటించడం, ప్రణాళికలు లీక్ కాకుండా చూసేందుకు బాలాకోట్ ఆపరేషన్ కి కోడ్ నేమ్ ఇచ్చినట్టు చెబుతాన్నారు. దీనికి 'ఆపరేషన్ బందర్' అని పేరు పెట్టారు.

ఈ పేరు పెట్టడం వెనుక ఏ ప్రత్యేక కారణాలు ఉన్నాయో వివరించకుండా చాలా కాలంగా భారత యుద్ధ సంస్కృతిలో కోతులకు ప్రత్యేక స్థానం ఉందని, రామాయణంలో చూస్తే శ్రీరాముడికి అండగా ఉన్న హనుమంతుడు నిశ్శబ్దంగా లంకలో ప్రవేశించి రావణ లంకను పూర్తిగా ధ్వంసం చేసి వచ్చినట్టుగా చేయాలనే ఈ పేరు పెట్టినట్టు చెబుతున్నారు.

ఫిబ్రవరి 26న అనేక వైమానిక స్థావరాల నుంచి ఎగిరిన 12 మిరాజ్ యుద్ధ విమానాలు పాకిస్థాన్ గగన తలంలోకి నిశ్శబ్దంగా ప్రవేశించి ఖైబర్ పఖ్తున్ఖ్వా ప్రాంతంలోని బాలాకోట్ పట్టణంలో ఉన్న జైషే మొహమ్మద్ ఉగ్రవాద స్థావరాలపై మిస్సైల్ దాడి చేశాయి. ఐఏఎఫ్ వెయ్యి కిలోల బాంబుల వర్షం కురిపించాయి. ఈ దాడిలో జైషే ఉగ్రవాద శిబిరాలను లక్ష్యంగా చేసుకున్నారు. దాడి తర్వాత విమానాలు భారత సరిహద్దులకు సురక్షితంగా తిరిగి వచ్చాయి.