మళ్లీ ఉల్లి లొల్లి షురూ... సెంచరీ వైపు..!

మళ్లీ ఉల్లి లొల్లి షురూ... సెంచరీ వైపు..!

గత కొంతకాలం క్రితం ఉల్లి ధర అందరినీ కలవర పెట్టింది.. దేశవ్యాప్తంగా ఆందోళనలు సైతం చేశారు.. విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి వచ్చింది.. అయితే, ఇప్పుడు మళ్లీ ఉల్లి లొల్లి షురూ అయ్యింది.. తెలుగు రాష్ట్రాల్లో ఉల్లి ధరలు రోజురోజుకు ఆకాశాన్నంటుతున్నాయి. సామాన్యులకు ఉల్లి కోయకుండానే కన్నీరు తెప్పిస్తోంది. రిటైల్ మార్కెట్‌లో వంద రూపాయలకు మూడు కిలోలు అమ్మిన వ్యాపారులు ఇప్పుడు ఒక్కసారిగా ధరను పెంచేశారు. ప్రస్తుతం కిలో ఉల్లి ధర సెంచరీకి చేరువలో ఉంది. మొన్నటి వరకు క్వింటా ఉల్లి ధర 1500 నుంచి 2000 పలికింది. ఇప్పుడు ఏకంగా 6 వేలకు పెరిగింది. మార్కెట్లో ఉల్లి కిలో ధర 60 రూపాయల నుంచి 80 రూపాయలకు చేరింది. కొన్ని చోట్ల వందకు చేరువలోనే ఉంది. తెలుగు రాష్ట్రాల్లో కురుస్తున్న వానలకు కూరగాయల పంటలు నీటి మునిగాయి. ఉల్లికి సైతం కొరత ఏర్పడింది. 

భారీ వర్షాలకు ఇప్పట్లో కొత్త స్టాక్‌ మార్కెట్‌కు రాదంటున్నారు వ్యాపారులు. ఉల్లి ధర ఇంకా పెరుగుతుందంటున్నారు. ఉదయం 6 గంటల నుంచే రైతు బజారుల్లో ఉల్లి కోసం బారులు తీరుతున్నారు జనం. 8, 9 గంటలకల్లా ఉన్న స్టాకు అయిపోతోంది.  ప్రభుత్వ ఆధీనంలో నడిచే రైతు మార్కెట్లలోనూ ఉల్లి ధర విపరీతంగానే ఉంది. కర్ణాటక..మహారాష్ట్ర.. నుంచి ఉల్లి సరఫరా కావాల్సి ఉంది. తగినంత దిగుమతి చేసుకోకపోవడంతో ధరలు పెరుగుతున్నాయి. గుజరాత్‌, మధ్యప్రదేశ్‌లలోనూ ఉల్లి ఎక్కువగానే సాగు అవుతుంది. ఈ ఏడాది అధిక వర్షాల కారణంగా ఉల్లి పంట దెబ్బతింది. సాగు తగ్గిపోవడం రేటు పెరగటానికి మరో కారణం. మరోవైపు... కొంతమంది వ్యాపారస్తులు ముందుగానే పరిస్థితిని అంచనావేసి సరుకును దాచిపెడుతున్నారు. ప్రత్యేక గోదాముల్లో దాచిపెట్టి బ్లాక్ మార్కెట్‌లో అధిక ధరకు అమ్ముకుంటున్నారు. గతంలో ఇలాంటి సమస్య వచ్చినప్పుడు రైతు మార్కెట్లలో టోకెన్లు పెట్టి మరీ అమ్మకాలు జరిపారు. టమాట ధర పెరిగినప్పుడు కూడా ప్రభుత్వాలు ఇలాగే చర్యలు తీసుకున్నాయి. అయితే, ఉల్లి ధరలు సామాన్యులకు భారంగా మారుతున్నాయి.. ఇప్పటికే హోటళ్లు, చాట్ బండర్‌ దగ్గర ఉల్లి మాయమైంది అని చెబుతున్నారు.. ఉల్లిధర మరింత పెరగకుండా ప్రభుత్వాలు ఇప్పటికైనా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు ప్రజలు.