తల్లీకూతుళ్ల సజీవదహనం కేసు ఛేదించిన పోలీసులు

తల్లీకూతుళ్ల సజీవదహనం కేసు ఛేదించిన పోలీసులు

ప్రకాశం జిల్లాలో జరిగిన తల్లీ కూతుళ్ల హత్య కేసును ఛేదించారు పోలీసులు. భార్యతో పాటు కూతుర్ని హత్య చేసిన తర్వాత మృతదేహాలను నిందితుడు కోటి దగ్ధం చేసినట్టు దర్యాప్తులో తేలింది. భార్యపై అనుమానంతో వివాహిత భర్తే ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు గుర్తించారు. ప్రకాశం జిల్లా సంతనూతలపాడు మండలం పేర్లమెట్ట శివారులో బురదతో ఉన్న డొంక దారిలో ఈ నెల మూడో తేదీ సాయంత్రం ఐదు గంటల సమయంలో ఓ మహిళ, ఏడాది వయసున్న బిడ్డ మంటల్లో తగులబడుతున్న దృశ్యాన్ని సమీపంలో ఉన్న కొందరు రైతులు చూశారు. ఆ సమాచారాన్ని గ్రామస్తులకు అందజేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. అయితే అప్పటికే ఆ రెండు మృతదేహాలూ దాదాపు కాలిపోయాయి. ఘటన జరిగిన సమయంలో అటుగా వెళ్లిన కొందరిని పోలీసులు విచారించారు.

అయ్యప్ప దీక్షలో ఉన్న ఇద్దరు ఇచ్చిన సమాచారంతో దర్యాప్తును వేగవంతం చేశారు. తాము ఆ బురద దారిలో వెళుతున్నప్పుడు ఓ యువకుడు, ఓ యువతి, ఓ చంటిబిడ్డతో మోటారు సైకిల్‌పై వస్తూ ఆగి కోపంతో దించుకుంటున్నారని వారు పోలీసులకు తెలిపారు. ‘‘ఈ బురద దారిలో గొడవేమిటి? మీరెవరు?’’ అని తాము అడగగా.. తాము భార్యాభర్తలమని, అటుగా పనుండి వెళ్తున్నామని వారు చెప్పారని స్వాములు వివరించారు. ఈ కోణంలో విచారణ చేపట్టిన పోలీసులు.. యువతి భర్తే తల్లీబిడ్డలను సజీవ దహనం చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. నిందితుడిని కోటేశ్వరరావుగా గుర్తించారు. అతడు స్థానిక ప్రైవేట్‌ ఆస్పత్రిలో పనిచేస్తున్నాడని అతడిది అద్దంకి మండలం దామావారిపాలెం అని తేల్చారు. కోటేశ్వరరావు చేతులకు కాలిన గాయాల ఆధారంగా దర్యాప్తు చేయడంతో నిజాలు వెలుగులోకి వచ్చాయి.