ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్ కీలక వ్యాఖ్యలు.. అది భావ్యం కాదు...

ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్ కీలక వ్యాఖ్యలు.. అది భావ్యం కాదు...

ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ తాజాగా చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ అమల్లోకి వచ్చిన తర్వాత తొలిసారి స్వయం సేవకులను ఉద్దేశించి ఆన్‌లైన్‌లో తన సందేశం వినిపించిన ఆయన... కొందరు చేసిన తప్పు వల్ల అందర్నీ నిందించవద్దని పిలుపునిచ్చారు. ప్రస్తుత పరిస్థితిని తమకు అనుకూలంగా మార్చుకోవడానికి కొన్ని భారత వ్యతిరేక శక్తులు పొంచి ఉన్నాయని చెప్పారు. ఎవరైనా తప్పు చేస్తే మొత్తం కమ్యూనిటీని దూరం చేయకూడదన్నారు. కొందరు చేసిన తప్పులకు ఓ వర్గం మొత్తాన్ని నిందించడం భావ్యం కాదని హితవుపలికారు ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్.. కోపంతోనో, భయంతోనో ఎవరన్నా తప్పు చేస్తే, దాన్ని సమాజం మొత్తానికి ఆపాదించలేమని... వారిని దూరంగా ఉంచలేమని అభిప్రాయపడ్డారు. కరోనా వ్యాప్తికి తబ్లీగీ సమావేశం కారణమంటూ ఆరోపణలు వెల్లువెత్తుతున్న వేళ మోహన్ భగవత్ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

ఇక, మహారాష్ట్రలోని పాల్ఘర్‌లో ఇటీవల జరిగిన ఇద్దరు హిందూ సాధువుల హత్యపై ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ స్పందించారు. ఘటనను తీవ్రంగా ఖండించిన ఆయన.. మన సమాజంలో హింసకు ఏమాత్రం తావు లేదన్నారు. శాంతిభద్రతలను కాపాడాల్సిన బాధ్యత అధికార యంత్రాంగంపై ఉందని గుర్తుచేశారు. ఘటన జరుగుతున్న సమయంలో పోలీసులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. దేశంలో ఉన్న‌ 130 కోట్ల మంది భరతమాత బిడ్డలేన‌ని ఆయన తెలిపారు. కోవిడ్‌ క్లిష్ట పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం సమర్థవంతంగా పనిచేస్తోందని, ప్రజలు కూడా సహకరిస్తున్నారని చెప్పారు. కరోనా విపత్తుతో సంఘ్ కార్యక్రమాలన్నింటినీ జూన్ నెలాఖరు వరకూ రద్దు చేయాలని గత మార్చిలోనే ఆర్ఎస్ఎస్ నిర్ణయం తీసుకుందని మోహన్ భగవత్ స్పష్టం చేశారు.