వన్ అండ్ ఓన్లీ సాయిప‌ల్లవి

వన్ అండ్ ఓన్లీ సాయిప‌ల్లవి

ఇవాల్టి రోజున తెలుగు చిత్రపరిశ్రమలోనే కాదు దక్షిణాదిన అన్ని భాషలతో పాటు బాలీవుడ్ లోనూ సినిమాలన్నీ హీరోల చుట్టూ తిరుగుతున్నాయి. సినిమాల్లో హీరో పాత్రలదే ఆధిపత్యం. ఇక ప్రచారంలోనూ వారిదే పై చేయి. ఏదో ఒకటి అరా హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రాలలో తప్ప మామూలు కమర్షియల్ సినిమాలలో మన కథానాయికలకు అంత ప్రాధాన్యం ఉండటం లేదు. ఐతే రానా హీరోగా రాబోతున్న 'విరాట‌ప‌ర్వం' సినిమాలో హీరోకు దీటుగా హీరోయిన్ పాత్ర ఉంటుందని తొలి నుంచి చెబుతూ వస్తున్నారు. సినిమాలో పాత్ర సంగతి పక్కన పెడితే ప్రచారంలోనూ హీరోయిన్ సాయిపల్లవికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. 

తాజాగా విడుదల చేసిన పోస్టర్ ఆ విషయాన్ని తేటతెల్లం చేస్తోంది. ఏదో హీరోయిన్ బర్త్ డేలాకు తప్ప ఏ సినిమా పోస్టర్లలోనూ హీరోయిన్ ను హైలైట్ చేయటం జరగటం లేదు. అలాంటిది ఈ సినిమా ప్రోమోలు, పోస్టర్లలో సాయిపల్లవినే హైలైట్ చేస్తున్నారు. పోస్టర్లలో ముందు సాయిప‌ల్లవి పేరు వేసి, త‌ర్వాత రానా పేరు వేస్తున్నారు. కోలు కోలు పాట పోస్టర్లోనూ అదే జరిగింది. నిజానికి ఈ గౌర‌వం ప్రస్తుతం మన చిత్రపరిశ్రమలో ఏ హీరోయిన్ కూ దక్కలేదు. వన్ అండ్ ఓన్లీ సాయిపల్లవికే దక్కింది. ఇక ఈ సినిమాను సమర్పిస్తోంది హీరో రానా తండ్రి సురేశ్ బాబు. రానా సైతం చిన్న హీరో కాదు. బాహుబ‌లితో అంత‌ర్జాతీయ గుర్తింపు సంపాదించాడు. హీరోగా తనకంటూ మార్కెట్ కూడా ఉంది. అలాంటి హీరో త‌న పేరు వెనుక ఉండ‌టానికి ఒప్పుకోవ‌డం అతని సంస్కారానికి నిదర్శనం కూడా. మరి బ‌ల‌మైన క‌థాంశంతో తెర‌కెక్కుతున్న ఈ సినిమా సాయిపల్లవి కెరీర్లో మ‌రో మైలురాయిగా నిలుస్తుందేమో చూడాలి.