గవాస్కర్ రికార్డుకు 32 ఏళ్లు

గవాస్కర్ రికార్డుకు 32 ఏళ్లు

సరిగ్గా 32 ఏళ్ల క్రితం టీమిండియా మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ టెస్టుల్లో పదివేల పరుగులు సాధించాడు. ఈ ఘనత సాధించిన తొలి క్రికెటర్‌గా గవాస్కర్ రికార్డు సృష్టించాడు. ప్రపంచ క్రికెట్‌లో తొలి టెస్టు మ్యాచ్ తర్వాత సరిగ్గా 110 ఏళ్లకు ( మార్చి 7, 1987) గవాస్కర్ పదివేల పరుగులు సాధించాడు. అహ్మదాబాద్‌లో భారత్, పాకిస్థాన్ మధ్య జరిగిన టెస్టులో గవాస్కర్ ఈ రికార్డు సాధించాడు. పాక్ బౌలర్ ఐజాజ్ ఫాఖీ వేసిన బంతిని థర్డ్‌మ్యాన్ దిశగా పంపి గవాస్కర్ ఈ అరుదైన రికార్డును తన పేరున లికించుకున్నాడు. అప్పుడు పాకిస్థాన్ జట్టుకు ఇమ్రాన్ ఖాన్ (ప్రస్తుత పాక్ ప్రధాని) సారథ్యం వహించాడు. 

సునీల్ గవాస్కర్ ఈ రికార్డు సాదించగానే మైదానంలోని అభిమానులు సందడి చేశారు. అభిమానుల హర్షద్వానాలతో మ్యాచ్ ను 20 నిమిషాల పాటు నిలిపివేశారు. గవాస్కర్ 124 టెస్టుల్లో (212 ఇన్నింగ్స్) పదివేల పరుగులు సాధించాడు. గవాస్కర్ తర్వాత మరో 12 మంది మాత్రమే టెస్టు క్రికెట్‌లో పదివేల పరుగుల మైలురాయిని అందుకున్నారు. సచిన్, పాంటింగ్, కల్లిస్, ద్రావిడ్, కుక్, సంగక్కర, లారా, చంద్రపాల్, జయవర్ధనే, బోర్డర్, స్టీవ్ వా, యూనిస్ ఖాన్ లు ఈ జాబితాలో ఉన్నారు.