జలదిగ్బంధంలో గ్రామాలు.. ఇళ్ల‌ను వ‌దిలి కొండ‌ల‌పైకి...!

జలదిగ్బంధంలో గ్రామాలు.. ఇళ్ల‌ను వ‌దిలి కొండ‌ల‌పైకి...!

ఎడ‌తెరిపి లేకుండా కురుస్తున్న వ‌ర్షం.. మ‌రోవైపు ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వ‌ర్షాల‌తో గోదావ‌రిలో వ‌ర‌ద పోటెత్త‌డంతో.. లంక గ్రామాల‌కు ముంపుబారిన‌ప‌డుతున్నాయి..  తొయ్యేరు-దేవీపట్నం, ఎ.వీరవరం మధ్య ఆర్‌అండ్‌బీ రహదారులపైకి వరద పోటెత్తింది.. దీంతో.. 36 గ్రామాలకు రాక‌పోక‌లు నిలిచిపోయాయి.. ఇక‌, ఎగువ కాఫర్‌ డ్యామ్‌కు ఎగువ గ్రామాల ప్రజల్లో  భయాందోళనలు నెల‌కొంది.. పోశమ్మగండి, పూడిపల్లి, తొయ్యేరు ఎస్సీ కాలనీ, దేవీపట్నం వద్ద మత్స్యకారపేటలోని ఇళ్లలోకి వరద నీరు చేరడంతో  ఇళ్లను ఖాళీ చేశారు ప్ర‌జ‌లు.. పోశమ్మగండి వద్ద వరద ఉగ్రరూపంతో కొండలపైకి చేరుకున్నారు స్థానికులు.. గండిపోశమ్మ అమ్మవారి ఆలయం వద్దకు కూడా చేరుకుంది వ‌ర‌ద‌నీరు.. పూడిపల్లి-పరగసానిపాడు మధ్య రాక‌పోలు నిలిచిపోయాయి.

తూర్పుగోదావ‌రి జిల్లాలోని ఎ.వీరవరం, గుబ్బలంపాలెం, గానుగులగొందు, ఏనుగులగూడెం పరిసరాల్లో పొలాల్లోకి భారీగా వరద నీరు చేరింది. పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలు, ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలను చుట్టుముట్టింది నీరు.. అగ్రహారం నుంచి కొండమొదలు వరకు  బిక్కుబిక్కుమని కాలం గడుపుతున్నారు గిరిజ‌నులు.. ఎగువ కాఫర్‌ డ్యామ్‌ వద్ద గోదావరి పరవళ్లు తొక్కుతూ దిగువకు ప్ర‌వ‌హిస్తోంది..  దేవీపట్నం నుంచి ఎ.వీరవరం వరకూ ఇంజిన్‌ పడవలపై ప్రజలను బయటకు తీసుకొస్తున్నారు అధికారులు. పూడిపల్లి వద్ద సీతపల్లి వాగుకు వరద నీరు పోటెత్తడంతో దండంగి, కె.వీరవరం, సీతారం వైపునకు గోదావరి పరుగులు పెడుతోంది.. దండంగి ఎస్సీకాలనీ సమీపంలోని పంట భూముల్లోకి వరద నీరు చేరింది. గోదావరి వరద సహాయక చర్యలకు ఏడు  పర్యాటక బోట్లను సిద్ధం చేశారు.  పోశమ్మగండిలో అయిదు, దేవీపట్నం పోలీసుస్టేషన్‌ వద్ద రెండు అందుబాటులో  ఉంచారు అధికారులు..  వీరవరం నుంచి దేవీపట్నం, తొయ్యేరుకు 17 ఇంజిన్‌ పడవలు ఏర్పాటుచేశారు. ఇక‌, ముంపు గ్రామాల్లో అయిదు సెక్టోరల్‌ బృందాలు విధులు నిర్వ‌హిస్తున్నాయి. ముంపు గ్రామాల ప్రజలకు బొర్నగూడెం, తొయ్యేరు, ముసినిగుంటలో పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు అధికారులు.