ఎమ్మెల్యే రోజాకు షాక్ ఇస్తున్న అధికారులు

ఎమ్మెల్యే రోజాకు షాక్ ఇస్తున్న అధికారులు

తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచినా ప్రతిపక్షంలో ఉండటంతో అభివృద్ధి పనులు చేయలేదని బాధపడ్డారు. రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచి.. పార్టీ అధికారంలోకి వచ్చినా.. ఇప్పుడు కూడా అదే బాధలో ఉన్నారట ఎమ్మెల్యే రోజా. ఏరికోరి తెచ్చుకున్న అధికారులు ఆమెకు నిత్యం షాక్‌ ఇస్తున్నారట. 

తొలిసారి ప్రతిపక్షంలో ఉండటంతో నిరాశ!

అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఉంటే.. నియోజకవర్గంలో తిరుగుండదు. నచ్చిన అధికారులను.. తమకు నచ్చిన చోట పోస్టింగ్‌ ఇచ్చుకుని అభివృద్ధి పనుల వేగం పెంచుకుంటారు. వైసీపీ ఫైర్‌బ్రాండ్‌ ఎమ్మెల్యే రోజా సైతం అదే అనుకున్నారట. తొలిసారి నగరి ఎమ్మెల్యే అయిన ఐదేళ్లలో ప్రతిపక్షంలో ఉండటంతో ఏ పనీ చేయలేకపోయానని.. అధికారులు, అప్పటి ప్రభుత్వం తనకు సహకరించలేదని చాలాసార్లు చెప్పుకొచ్చారామె. 

అనుకూలురైన అధికారులకు పోస్టింగ్స్‌!
ఆఫీసుల్లో అవినీతి దుకాణాలు తెరిచేశారా? 

నగరి నుంచి రెండోసారి ఎమ్మెల్యే కావడం.. వైసీపీ పవర్‌లోకి రావడంతో అనుకున్న పనులన్నీ చక చకా చేయిస్తానని ప్రజలకు మాట ఇచ్చారు రోజా. పనుల్లో స్పీడ్‌ పెంచేందుకు తనకు అనుకూలురైన అధికారులను రెవెన్యూ, పంచాయతీరాజ్‌, పోలీస్‌ తదితర శాఖల్లో పోస్టింగ్‌లు ఇప్పించుకున్నారట. ఇంత వరకు బాగానే ఉన్నా.. ఈ విషయంలో రోజా ఒకటి తలిస్తే..  అధికారులు మరొకటి చేస్తున్నారట. ఎమ్మెల్యే సిఫారసులతో నగరిలో పోస్టింగ్‌లు దక్కించుకున్న వారు.. రోజాకే షాక్‌ ఇచ్చేలా పనిచేస్తున్నారట. ఎమ్మెల్యే చెప్పే మాటలను కొందరు ఎడమ చెవితో విని కుడి చెవితో బయటకు వదిలేస్తుంటే..  ఇంకొందరైతే తమ కార్యాలయాల్లో అవినీతి దుకాణాన్నే తెరిచేశారట. ప్రస్తుతం నగరిలో ఈ అంశంపైనే కథలు కథలుగా చెప్పుకొంటున్నారు. 

ఇప్పటికే ఓ ఎమ్మార్వోను బదిలీ చేయించిన రోజా!

రోజా సిఫారసుతో వచ్చిన ఓ ఎమ్మార్వో అవినీతి విషయంలో మొదటి స్థానంలో ఉన్నారట. YSR హౌసింగ్‌ స్కీమ్‌లో లబ్ధిదారుల నుంచి సదరు ఎమ్మార్వో ఆయన కింద పనిచేసే సిబ్బంది పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేశారట. వెంటనే అప్రమత్తమైన రోజా.. జిల్లా అధికారులకు చెప్పి ఆ ఎమ్మార్వోను అక్కడి నుంచి ట్రాన్స్‌ఫర్‌ చేయించారట. మరో ఎమ్మార్వో తీరు కూడా అలాగే ఉందట. ఆయనపైనా ఆయన దగ్గర పనిచేసే సిబ్బందిపైనా  జిల్లా అధికారులు ఓ కమిటీని వేసి విచారణ చేపట్టారు. రెండో ఎమ్మార్వోపైనా రేపోమాపో వేటు ఖాయమనే ప్రచారం జరుగుతోంది. 

ఎమ్మెల్యే రోజా ఆందోళనతో ఉన్నారా?

పోలీస్‌ శాఖలోనూ అదే పరిస్థితి ఉందట. ఓ ఎస్‌ఐను వీఆర్‌కు పంపారు. తడ చెక్‌పోస్టు దగ్గర అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న నలుగురు పోలీసులను సస్పెండ్‌ చేశారు. వైఎస్‌ఆర్‌ ఆసరాలో అధికారుల అవినీతిపై రోజా ఆగ్రహంగా ఉన్నారట. ఇదే సమయంలో ప్రజలు సైతం ప్రభుత్వ సిబ్బంది తీరుతో తీవ్ర అసహనంతో ఉన్నారట. భవిష్యత్‌తో ఇది ఎక్కడ తనకు ప్రతికూలంగా మారుతుందో అని రోజా ఆందోళనతో ఉన్నట్టు సమాచారం. 

చేయి తడపందే పనులు కావడం లేదా? 

నగరిలో ఏడాదిన్నరగా ఇదే పరిస్థితి ఉందట. సామాన్యులే కాదు.. పార్టీ కార్యకర్తలు వెళ్లినా.. ప్రభుత్వ కార్యాలయాల్లో చేయి తపడందే పనులు కావడం లేదని సమాచారం. అలా లంచం అడుగుతున్న అధికారులు ఎమ్మెల్యే సిఫారసుతో వచ్చారని తెలిసి కేడర్‌  ఏం మాట్లాడలేకపోతున్నారట.  మరి.. ఈ ఇబ్బందులను రోజా ఎలా అధిగమిస్తారో?  ఏం చేస్తారో చూడాలి.