పాలకొల్లులో పార్టీ బలోపేతానికి వైసీపీ కొత్త వ్యూహం..!

పాలకొల్లులో పార్టీ బలోపేతానికి వైసీపీ కొత్త వ్యూహం..!

పశ్చిమగోదావరి జిల్లాలో ఎన్నికల్లో క్లీన్‌ స్వీప్‌కు కూతవేటు దూరంలో ఆగిపోయింది వైసీపీ. పాలకొల్లులో పాగా వేయాలని అనుకున్నా నిమ్మలకే పట్టం కట్టారు జనం. ఆయనేమో అధికార పార్టీకి కంట్లో నలుసుగా మారారు. పైగా అటు నుంచి ఇటు వచ్చే అవకాశాల్లేవట. దీంతో క్షీరపురిలో వ్యూహం మార్చిందట వైసీపీ. అదేంటో ఈ స్టోరీలో చూద్దాం!

పదవులన్నీ పాలకొల్లుకే!

పశ్చిమగోదారి జిల్లాలో 15 స్థానాల్లో 13 చోట్ల వైసీపీ ఎమ్మెల్యేలు గెలిచారు. పాలకొల్లు, ఉండిలో టీడీపీ విజయం సాధించింది. అసెంబ్లీ ఎన్నికలైన నాటి నుంచీ ఈ రెండు నియోజకవర్గాలపై  అధికార పార్టీ ఫోకస్‌ పెట్టింది. వీటిలో పాలకొల్లు నుంచి వరుసగా రెండోసారి గెలిచిన నిమ్మల రామానాయుడు వైసీపీకి పంటికింద రాయిలా మారారు. ఆయన పార్టీ మారతారని భావించినా అది జరగలేదు. అందుకే నియోజకవర్గంలో పూర్తి పట్టు సాధించే పనికి శ్రీకారంచుట్టింది వైసీపీ. ఈ ఎత్తుగడల్లో భాగంగానే జిల్లా స్థాయి, నామినేటెడ్‌ పదవులు అన్నీ పాలకొల్లుకే కట్టబెడుతున్నారు. ఇది అధికార పార్టీలోనూ చర్చకు కారణమైంది. 

డీసీసీబీ చైర్మన్‌, డీసీఎంఎస్‌ చైర్మన్‌ ఇద్దరిదీ పాలకొల్లే!

ప్రస్తుతం పాలకొల్లులో వైసీపీ ప్లాన్‌ బీ తెరపైకి వచ్చిందని టాక్‌. రామానాయుడిని డ్రామానాయుడు అని విమర్శిస్తూనే  పావులు కదుపుతున్నారట. నిమ్మలను ఎదుర్కొనే విషయంలో పాలకొల్లు మాజీ ఎమ్మెల్యే డాక్టర్‌ బాబ్జి బలం సరిపోవడం లేదని భావించి.. బీసీ నేత కవురు శ్రీనివాస్‌ను నియోజకవర్గ ఇంఛార్జ్‌ను చేశారు. అంతేకాదు కవురును ఏకంగా DCCB చైర్మన్‌ను చేశారు. ఈ చర్యలు సరిపోవని భావించారో ఏమో పాలకొల్లుకే చెందిన కాపు సామాజికవర్గం నేత యడ్ల తాతాజీకి DCMS చైర్మన్‌ పదవి ఇచ్చారు. 

జడ్పీ చైర్మన్‌గా కవురు, పార్టీ ఇంఛార్జ్‌గా గుణ్ణం?
ఇవాన్నీ చాలవనుకున్నట్టున్నారు. ఇప్పుడు ఇంకో ప్లాన్‌కి వైసీపీ తెరతీస్తోంది. DCCB చైర్మన్‌గా ఉన్న కవురును ఆ పదవి నుంచి తప్పించి ఏకంగా జిల్లా పరిషత్‌ చైర్మన్‌ను చేద్దామనే ఆలోచనలో అధికార పార్టీ ఉందట. అలాగే పాలకొల్లు వైసీపీ ఇంఛార్జ్‌గా కాపు సామాజికవర్గ నేతనే నియమించాలని అనుకుంటోందట. ఇందుకోసం గతంలో వైసీపీలో ఉండి.. ఎన్నికల సమయంలో జనసేనలో చేరిన గుణ్ణం నాగబాబును తిరిగి తీసుకొస్తారనే ప్రచారం జోరందుకుంది. ఈ విషయం తెలుసుకున్నప్పటి నుంచి ఎమ్మెల్యే నిమ్మల శిబిరంలో అలజడి మొదలైందని టాక్. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు నిమ్మల ఎవరినీ లెక్క చేయలేదనే విమర్శ ఉంది. రెండోసారి గెలిచిన తర్వాత ఆయన్ని ఎవరూ లెక్క చేయడం లేదట. ఇదే అంశంపై పలుమార్లు జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు రామానాయుడు. 

పాలకొల్లులో వైసీపీ పద్మవ్యూహం?

ఇప్పుడు పాలకొల్లులో మారుతున్న పరిస్థితులు పద్మవ్యూహాలను తలపిస్తుండటంతో నిమ్మల  పోరాటం చేస్తారో.. అస్త్రసన్యాయం చేస్తారో అన్న చర్చ మొదలైంది. ఇదే జిల్లాకు చెందిన  ఉండి నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే రామరాజు ఇలాంటి పరిస్థితిని ముందే అర్థం చేసుకున్నారో ఏమో గెలిచిన వెంటనే కామ్‌ అయిపోయారు. మరి.. నిమ్మల కూడా రామరాజులా మిగిలిన కాలాన్ని గడిపేస్తారో లేక వైసీపీ పద్మవ్యూహానికి చిక్కుతారో చూడాలి. వైసీపీ మాత్రం ఇదే అదనుగా వ్యూహాలను పదును పెడుతోంది.. దీంతో పాలకొల్లు రాజకీయాలు రంగుమారిపోతున్నాయి.