వైద్య శాఖామంత్రి సొంత జిల్లాలో కరోనా వైద్యం పడకేసిందా?

వైద్య శాఖామంత్రి సొంత జిల్లాలో కరోనా వైద్యం పడకేసిందా?

బాబోయ్‌ ఊపిరి ఆడటం లేదు. ప్రాణాలు పోతున్నాయ్‌.  కాపాడండి అని కరోనా రోగులు నెత్తీనోరు కొట్టుకుని ప్రాధేయ పడుతున్నా.. అక్కడి సిబ్బందిలో చలనం ఉండటం లేదట. పైగా అది మంత్రిగారి ఇలాక కావడంతో ఎంతో మెరుగైన చికిత్స అందుతుందని వస్తే జీవుడు ఆరిపోవడం ఖాయమంటున్నారు. ఇంతకీ ఆ ప్రాంతం ఎక్కడుంది?  

ఏలూరులో కరోనా రోగులకు మెరుగైన చికిత్స అందడం లేదా?

పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులోని జిల్లా కోవిడ్‌ ఆస్పత్రిలో ప్రజల ప్రాణాలకు గ్యారెంటీ లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎవరైనా ప్రాణాలు కోల్పోతే వారి భౌతికదేహాలను వేగంగా తరలించడం లేదని అంటున్నారు. దీంతో చికిత్స కొచ్చిన వారు బెంబేలెత్తిపోతున్నారట. ఏలూరు ఎమ్మెల్యేగా ఆళ్ల నాని ఉన్నారు. ఆయన డిప్యూటీ సీఎం. వైద్య ఆరోగ్య శాఖ ఆయన అధీనంలోనే ఉంది. అందుకే ఏలూరులో మెరుగైన చికిత్స అందుతుందని వచ్చిన వారికి నిరాశ తప్పడం లేదనే కామెంట్స్‌ వినిపిస్తున్నాయి. 
 
క్షేత్రస్థాయిలో జరిగే విషయాలను మంత్రి పట్టించుకోవడం లేదా?

కరోనాతో ఎవరైనా చనిపోతే.. అంత్యక్రియలు ఎవరు చేయాలి? ఎలా చేయాలి అన్న అంశాలపై  ప్రభుత్వం స్పష్టమైన మార్గ దర్శకాలను విడుదల చేసింది. కానీ... ఏలూరులో వాటిని పట్టించుకోవడం లేదట. ఇదే సమయంలో క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందో మంత్రి ఆరా తీయడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 

ఆస్పత్రిలో ఎవరైనా వీడియోలు తీస్తే శవాలను అక్కడే ఉంచేస్తున్నారా?

రాష్ట్రంలో కరోనా రోగులకు చికిత్స ఎలా అందుతుంది.. వైద్య సిబ్బంది సేవలు ఏ విధంగా ఉన్నాయో మంత్రిగా ఆళ్లనాని పర్యటిస్తూ తెలుసుకుంటున్నారు. అదే సమయంలో ఆయన సొంత నియోజకవర్గం ఏలూరులో ఏం జరుగుతుందో తెలుసుకోవడం లేదని అంటున్నారు. మంత్రి పట్టించుకోకపోవడంతో సిబ్బందిలోనూ నిర్లక్ష్యం పెరిగిపోయిందని చెబుతున్నారు. కరోనా రోగులకు  సరైన వసతులు లేవనేది అందరూ చెప్పేమాట. ఎవరైనా వీడియో తీసి సోషల్‌ మీడియాలో పెడితే గగ్గోలు రేగుతోంది. ఎవరు వీడియో తీశారో తెలుసుకుని.. వారికి దగ్గరగా ఎవరైనా చనిపోతే.. శవాన్ని తరలించకుండా వదిలేస్తున్నారట. డాక్టర్లు కూడా అటు రావడం లేని సమాచారం. 
 
పాజిటివ్‌ రోగులకు గంట తరబడి నిరీక్షణ తప్పడం లేదా?

కరోనా నిర్ధారణ పరీక్షల ఫలితాల కోసం రోజుల తరబడి వెయిట్‌ చెయ్యాల్సి వస్తోందని అంటున్నారు. కొన్ని సందర్భాలలో పాజిటివో.. నెగిటివో కూడా చెప్పడం లేదట. ఒకవేళ ఎవరికైనా పాజిటివ్‌ అని తేలితే.. బస్సుల్లో తీసుకెళ్లి రోడ్లపైనే గంటల తరబడి వెయిట్‌ చేస్తున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 

రోగుల విషయంలో ఏదో పగబట్టినట్లు కాకుండా... కరోనా సమయంలో దయ, జాలి చూపించాలని కోరుతున్నారు ప్రజలు. స్వయంగా మంత్రి జోక్యం చేసుకుంటేగానీ ఈ సమస్యకు పరిష్కారం రాదని అభిప్రాయపడుతున్నారు. మరి..ఆళ్లనాని ఏలూరుపై ఫోకస్‌ పెడతారో లేదో చూడాలి.