మంత్రి కన్నబాబుకు ఏమైంది?

మంత్రి కన్నబాబుకు ఏమైంది?

రాజకీయాల్లోకి వచ్చిన పదేళ్లకే మంత్రి అయ్యారు. ఏమైందో ఏమో కానీ.. ఏడాదికే సైలెంట్‌ అయ్యారు. సెకండ్‌ టర్మ్‌కే మంత్రి అయ్యారు. మంత్రి అవుతూనే సీఎం జగన్‌కు దగ్గరయ్యారు. వ్యవసాయ శాఖ మొత్తం ఇచ్చారు. పెద్ద బాధ్యత నెత్తిన పెట్టారు. అందుకు తగ్గట్టుగానే కన్నబాబు రియాక్ట్‌ అయ్యారు. జగన్‌ మీద, ప్రభుత్వం మీద ఈగ వాలితే సహించలేదు. అసెంబ్లీలో కానీ.. బయట కానీ అటు టీడీపీని, చంద్రబాబును ఓ రేంజ్‌లో ఆడుకున్నారు. ప్రభుత్వాన్ని విమర్శిస్తే పవన్‌ కల్యాణ్‌ను కూడా ఆయన స్పేర్‌ చేయలేదు. రాజకీయంగా అనుభవం తక్కువైనా కొద్ది రోజులకే పాలిటిక్స్‌లో ఎమర్జ్‌ అయిపోయారు. జర్నలిస్ట్‌గా ఉన్న అనుభవమో.. రాజకీయాలను దగ్గర నుంచి చూటడం వల్లో కానీ మంత్రిగా సక్సెస్‌ టాక్‌ అందుకున్నారు. త్వరలో పరిపాలనా రాజధాని కాబోతున్న విశాఖకు కన్నబాబును ఇంఛార్జ్‌గా పెట్టారు సీఎం జగన్‌. 

విశాఖ జిల్లా ఇంఛార్జ్‌ మంత్రిగా రాజధాని ఏర్పాట్లతో బిజీబిజీగా ఉన్న కన్నబాబు మొన్న కరోనా  వచ్చినప్పటి నుంచీ బయటకు రావడం లేదు. రాజకీయ సెటైర్లు లేవు. పూర్తిగా సైలెంట్‌ అయ్యారు.  ప్రజలకు.. వైసీపీ కార్యకర్తలకు అందుబాటులో లేరు.  గోదావరికి రెండుసార్లు వెంట వెంటనే భారీగా వరదలు సంభవించి తూర్పుగోదావరి జిల్లాలో వేలాది హెక్టార్లలోని పంటలకు అపారనష్టం వాటిల్లింది. ఇలాంటి సమయంలో పంట నష్టపోయిన రైతుల కోసం వ్యవసాయ మంత్రి కన్నబాబు కనీసం పేపరు ప్రకటన కూడా చేయలేదని సొంత పార్టీలోనే కామెంట్స్‌ వినిపిస్తున్నాయి. విశాఖ జిల్లా ఇంఛార్జ్‌ మంత్రిగా బిజీబిజీగా ఉంటూ జిల్లాలోని రాజకీయ వ్యవహారాలను కూడా పట్టించకోవడం లేదని కేడర్‌ చెవులు కొరుక్కుంటోంది. అలాంటి కన్నబాబు ఇటీవల చెలమలశెట్టి సునీల్‌ వైసీపీలో చేరిక సందర్భంగా సీఎం జగన్‌ దగ్గర కనిపించారు. గతంలో ఎమ్మెల్యేగా పని చేసినప్పుడు కాకినాడ రూరల్‌లో విస్తృతంగా పర్యిటిస్తూ ప్రజల సమస్యలు తెలుసుకుని పరిష్కరించేవారు. ఇప్పుడు పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. రెండోసారి ఎమ్మెల్యే గెలిచి మంత్రి అయి ఏడాది దాటినా ఇప్పటి వరకూ పూర్తిస్థాయిలో నియోజకవర్గంలో పర్యటించలేదనే టాక్‌ ఉంది. ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన గ్రామ సచివాలయ వ్యవస్థను తన నియోజకవర్గంలోని కరప నుంచి ప్రారంభించడానికి ముఖ్యమంత్రి జగన్‌ను తీసుకొచ్చారు. ఈ స్థాయిలో శ్రద్ధ పెట్టినా నియోజకవర్గం బాధ్యతలను కుటుంబ సభ్యులు చూస్తుండటంతో పార్టీ శ్రేణులు అసంతృప్తితో ఉన్నప్పటికీ ఎవరూ బయట పడలేకపోతున్నారట. 

నియోజకవర్గంలోని వ్యవసాయ మార్కెట్‌ కమిటీ పోస్టులు తప్ప ఎటువంటి నామినేటెడ్‌ పోస్టులు ఇప్పటి వరకూ భర్తీ కాలేదు. రైతులు దళారీల చేతిలో మోసపోకుండా గత రబీ సీజన్లో పండిన ధాన్యాన్ని గ్రామ సచివాలయం ద్వారా కొనుగోలు చేసి గిట్టుబాటు ధర కల్పిస్తామని చెప్పినప్పటికీ అది ఆచరణలో విఫలమైందని రైతులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారట. సంక్షేమ కార్యక్రమాలు తప్పితే ఇప్పటి వరకూ ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టకపోవడంతో ప్రజల్లో అసంతృప్తి  వ్యక్తమవుతోందని అంటున్నారు. మారిన రాజకీయ  పరిణామాలతో  మంత్రి కన్నబాబు వెంట తిరిగే  కేడర్, సపోర్ట్‌గా ఉండే   ఎమ్మెల్యేలు  ఇప్పుడు  రూటు మార్చేశారట. కొత్తగా మంత్రి పదవి చేపట్టిన చెల్లుబోయిన వేణు వెనుక తిరుగుతున్నారట. వేణు జిల్లా అంతా విస్తృతంగా పర్యటించి వైసీపీ కేడర్‌ను తన వైపు తిప్పుకొంటున్నారట. జిల్లా పరిషత్ చైర్మన్‌గా పని చేసిన పరిచయాలతో మంత్రి వేణు దూకుడు పెంచారన టాక్‌. మరి.. రానున్న రోజుల్లో మంత్రి కన్నబాబు తన రూటు మార్చుకుంటారో.. లేక  సైలెంట్‌గానే ఉండిపోతారో చూడాలి.