భూత వైద్యం పేరుతో మహిళకు చిత్రహింసలు..ఆస్పత్రికి తరలింపు.!

 భూత వైద్యం పేరుతో మహిళకు చిత్రహింసలు..ఆస్పత్రికి తరలింపు.!

మంచిర్యాల జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. తనను తాను మాంత్రికుడు అని చెప్పుకునే వ్యక్తి ఒక మహిళ అనారోగ్యాన్ని నయం చేయడానికి జుట్టును పట్టుకొని దారుణంగా కొట్టాడు. ఈ ఘటన మంచిర్యాల జిల్లాలోని జైపూర్ మండలంలోని కుందరం గ్రామంలో జరిగింది. వివరాల్లోకి వెళితే...బాధితురాలు రజిత నాలుగు నెలల క్రితం ఒక ఆడ శిశువుకు జన్మనిచ్చింది. గత కొన్ని రోజులుగా ఆమె అనారోగ్యంతో బాధపడుతోంది.కాగా రజిత కుటుంబం సహాయం కోసం దుగ్గల శ్యామ్‌ అనే వ్యక్తిని సంప్రదించింది. దాంతో అతడు రజితపై ఆత్మల ప్రభావం ఉందని రజిత కుటుంబాన్ని నమ్మించాడు. అనంతరం నిందితుడు రజిత ఇంటికి వెళ్లి ఆమెను వెంట్రుకలతో లాగి దారుణంగా కొట్టాడు.

కాగా మంత్రగాడు కొట్టిన దెబ్బలకు రజిత స్పృహ తప్పి పడిపోయింది . దాంతో ఆమెను కరీంనగర్ లోని ఓ ఆసుపత్రిలో చేర్పించారు. ఆమె ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు చెబుతున్నారు. ఈ ఘటన పై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడితోపాటు మరికొందరిని అదుపులోకి తీసుకున్నారు.