గల్లీ నుంచి ఢిల్లీ వరకూ ఓ వెలుగు వెలిగిన నేతకు ఇప్పుడు ఏమయింది !

గల్లీ నుంచి ఢిల్లీ వరకూ ఓ వెలుగు వెలిగిన నేతకు ఇప్పుడు ఏమయింది !


ఉత్తరాంధ్ర రాజకీయాల్ని ఒంటి చేత్తో నడిపించారు. ఒకానొక సమయంలో ఏపీ రాజకీయాల్లో తిరుగులేని నేతగా ఢిల్లీ లెవల్లో చక్రం తిప్పారు. ఇప్పుడు కూడా కీ రోల్‌ పోషించే స్థానంలో ఉన్నా.. ప్రమోషన్‌ దక్కడం లేదనే అసంతృప్తి ఉందట. పైగా జూనియర్లతో సర్దుకుపోవాల్సి రావడం మరింత ఇబ్బందిగా ఉందని సమాచారం. దీనికితోడు ఇటీవల పరిణామాలు అస్సలు మింగుడుపడటం లేదని అంటున్నారు.  

విజయనగరం జిల్లాలో వైసీపీ క్లీన్‌స్వీప్‌ చేయడంలో ముఖ్య పాత్ర!

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో సీనియర్‌ రాజకీయ వేత్త బొత్స సత్యనారాయణ. ఎంపీగా, మంత్రిగా, పీసీసీ అధ్యక్షుడిగా పనిచేసిన ఘనత ఆయన సొంతం. ప్రస్తుతం వైసీపీలో ఉన్న ఆయన.. సీఎం జగన్‌ కేబినెట్‌లో మంత్రిగా మున్సిపల్‌ శాఖ బాధ్యతలు చూస్తున్నారు. ఆయన పదవులు సంపాదించడమే కాదు.. నమ్ముకున్నవారికి కూడా పదవులు లభించేలా చేస్తారని బొత్స అనుచరులు చెబుతుంటారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో విజయనగరం జిల్లాను YCP క్లీన్‌ స్వీప్‌ చేయడంలో కీలక పాత్ర పోషించారు. 

జూనియర్ల కింద పనిచేయడంపై నొచ్చుకున్నా సర్దుకుపోతున్నారా?

ఇదంతా బాగానే ఉన్నా.. YCP ప్రభుత్వంలో బొత్స సత్యనారాయణకు సరైన ప్రాధాన్యం దక్కడం లేదని ఆయన అభిమానులు, వెన్నంటి ఉండే వైసీపీ కార్యకర్తలు అభిప్రాయపడుతున్నారట. విజయనగరం జిల్లాకు చెందిన ఎమ్మెల్యే  పుష్ప శ్రీవాణిని ఏకంగా డిప్యూటీ సీఎంను చేయడంపై అప్పట్లోనే బొత్స వర్గీయులు పెదవి విరిచారని ప్రచారం జరిగింది. ప్రొటోకాల్‌  ప్రకారం డిప్యూటీ సీఎం తర్వాత మంత్రి స్థానాలు ఉండటంతో ఇబ్బందిగా ఫీలవుతున్నారట. తనకంటే జూనియర్‌ అయిన నేత పైవరసలో ఉంటే.. ఆయన కింద వరుసకు చేరుకోవడంపై నొచ్చుకుంటున్నారట. అలా ఏడాదిగా సర్దుకుపోతూ వస్తున్నా.. ఎప్పటికైనా మంచి రోజులు వస్తాయని మౌనంగా ఎదురు చూస్తూ వచ్చారట బొత్స అనుచరులు. 

మొన్నటి కేబినెట్‌ మార్పుల్లో పదోన్నతి వస్తుందని ఆశించారా?

మూడు రాజధానుల వివాదం, సీఆర్డీయే రద్దు వంటి కీలక నిర్ణయాల తర్వాత ప్రతిపక్షాల విమర్శలను తిప్పికొట్టడంలో బొత్స కీలక పాత్ర నిర్వహిస్తూ వస్తున్నారు. కేబినెట్‌లోని మిగతా మంత్రులకంటే ధాటిగా విరుచుకుపడుతున్నారు. ఇవన్నీ చూసి బొత్సకు ప్రమోషన్‌ ఖాయమని అనుచరులు భావించారట. మోపిదేవి, పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌ స్థానాల్లో కొత్త మంత్రులను తీసుకున్న సమయంలో పదోన్నతి కల్పిస్తారని ఆశించారట అనుచరులు. కానీ... మళ్లీ నిరాశ తప్పలేదని.. ఆ సమయంలో చోటుచేసుకున్న మార్పులు, పరిణామాలు ఇంకా బాధించాయని అంటున్నారట. 
 
ధర్మానను ప్రమోట్‌ చేయడంపై బొత్స వర్గంలో నిరాశ?

విజయనగరం పక్క జిల్లా శ్రీకాకుళానికి చెందిన ధర్మాన కృష్ణదాస్‌ను డిప్యూటీ సీఎంను చేయడంతో బొత్స వర్గం కంగుతిందట. ఉప ముఖ్యమంత్రిని చేయడంతోపాటు కీలకమైన రెవెన్యూ శాఖను కేటాయించడం నిరాశ పర్చిందట. మొన్నటి కేబినెట్‌ శాఖ మార్పుల్లో డిప్యూటీ సీఎం కాకపోయినా కనీసం రెవెన్యూ శాఖను కేటాయించినా.. ప్రాధాన్యం దక్కినట్లుగా భావించేవారమని చెవులు కొరుక్కుంటున్నారట. 
 
తొలిసారి కేబినెట్‌లో చేరిన వారికే కీలక పదవులు!

ప్రస్తుతం ఉత్తరాంధ్ర నుంచి కేబినెట్‌లో ఇద్దరు డిప్యూటీ సీఎంలు ఉన్నారు. ఇద్దరూ మొదటిసారి మంత్రివర్గంలో చేరిన వారే. అలాంటి వారికే కీలక పదవులు లభించడం.. రాజకీయంగా సీనియర్లుగా ఉన్నవారికి తగిన ప్రాధాన్యం లభించకపోవడంతో లోలోన నిరాశ ఉన్నా.. ఏటి సేత్తాం అని సర్దుకుపోతున్నారట. చూద్దాం.. మన టైమ్‌ ఎప్పుడొస్తుందో అని లెక్కలు వేసుకుంటున్నారట. మరి.. ఆ సమయం వస్తుందో లేదో చూడాలి.