ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలు.. హైకోర్టు కీలక వ్యాఖ్యలు

ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలు.. హైకోర్టు కీలక వ్యాఖ్యలు

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా ఎఫెక్ట్‌తో వాయిదా పడిన స్థానిక సంస్థల ఎన్నికల అంశం మరోమారు తెరమీదకు వచ్చింది. ఈ ఎన్నికలకు సంబంధించి దాఖలైన పిటిషన్‌ను ఇవాళ విచారించిన ఏపీ హైకోర్టు.. కీలక వ్యాఖ్యలు చేసింది. ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారని.. కోర్టు ప్రశ్నించగా కరోనా ఉధృతివల్ల ఇప్పుడు సాధ్యం కాదని చెప్పింది ప్రభుత్వం. కాగా, అదే మాటను ఈసీకి చెప్పాలని సూచించింది హైకోర్టు. ఎన్నికల సంఘానికి నోటీసులు జారీ చేసింది. కాగా, గతంలో కరోనా కారణంగా ఎన్నికల నిర్వహణను ఈసీ వాయిదా వేసింది. రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారంటూ.. ఆ సమయంలో ఎస్ఈసీ నిర్ణయాన్ని ఏపీ సర్కార్ తప్పుబట్టింది. ఈ విషయంలో తీవ్రస్థాయిలో వివాదం చెలరేగింది. 

ఎస్‌ఈసీ వర్సెస్‌ రాష్ట్రప్రభుత్వం అన్నట్టుగా వ్యవహారం నడిచింది. ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఎస్‌ఈసీని మార్చగా..  కోర్టు ఆదేశాలతో మళ్లీ నిమ్మగడ్డ రమేష్‌ బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత ఆ వ్యవహారం సైలెంటైపోయింది. అయితే, తాజాగా మరోసారి హైకోర్టు విచారణ సందర్భంగా ఏపీ స్థానిక సంస్థ ఎన్నికల వ్యవహారం తెరమీదకు వచ్చింది. అప్పుడు ఎన్నికల వాయిదాను తప్పుబట్టిన ఏపీ సర్కారే.. ఇప్పుడు ఎన్నికల నిర్వహించడం కష్టమంటూ కోర్టు తెలిపింది. అయితే, ఇలాంటి పరిస్థితుల్లోనూ కొన్ని రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న విషయాన్ని ఈ సందర్భంగా కోర్టు గుర్తు చేసింది. దీనిపై అభిప్రాయం తెలపాలంటూ ఎస్‌ఈసీకి నోటీసులు జారీ చేసిన కోర్టు..  తదుపరి విచారణ నవంబరు 2కి వాయిదా వేసింది.