ఏపీలో కేసీఆర్ ఆదరణను ఓర్వలేకపోతున్నాడు

ఏపీలో కేసీఆర్ ఆదరణను ఓర్వలేకపోతున్నాడు

ఆంధ్రప్రదేశ్ లో సీఎం కేసీఆర్ కు వస్తున్న ఆదరణను చూసి చంద్రబాబు ఓర్వలేకపోతున్నారని నాగార్జున సాగర్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య మండిపడ్డారు. ఏపీ సీఎం చంద్రబాబు కల్లు తాగిన కోతిలా ప్రవర్తిస్తున్నారని, కేసీఆర్ భాషను ఆయన తప్పు పడుతున్నారని ఆరోపించారు. అధికారం కోసం అడ్డదారులు తొక్కింది చంద్రబాబే అని వ్యాఖ్యానించారు. వానలు పడితే వాతలు పోవు.. చంద్రబాబు పాత చరిత్రను మరిచిపోరని అన్నారు. బీసీలకు పంచాయతీల్లో 24 శాతం సీట్లు ఇవ్వాలని సుప్రీంకోర్టు చెప్పింది అని ఎమ్మెల్యే నోముల గుర్తు చేశారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోదండరాం బీసీలపై మొసలి కన్నీళ్లు కారుస్తున్నారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు బీసీ ఫెడరేషన్లకు ఒక్క పైసా కూడా కేటాయించలేదు. టీఆర్ఎస్ ప్రభుత్వంలో బీసీలకు 90 శాతం సబ్సిడీతో పెట్టుబడి సమకూరుస్తున్నామని తెలిపారు. బీసీలను అన్ని విధాలా అణచివేసిన నేతలే ఇప్పుడు పెద్ద గొంతు చేసుకొని మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ నేతలకు దమ్ముంటే చట్టసభల్లో బీసీలకు 33 శాతం రిజర్వేషన్ల కోసం దేశ వ్యాప్తంగా అన్ని రాష్ర్టాల్లో తీర్మానాలు చేయించాలని డిమాండ్ చేశారు. ఢిల్లీకి అఖిలపక్షంగా వెళ్లినా కూడా ప్రస్తుత పరిస్థితుల్లో సాధించేది ఏమి ఉండదన్నారు. బీసీలకు ఎవరేం చేశారో తేల్చుకునేందుకు ఉత్తమ్ కుమార్ రెడ్డికి దమ్ముంటే తనతో బహిరంగ చర్చకు రావాలని నోముల నర్సింహయ్య సవాల్ విసిరారు.