మావోలు ఎక్కువున్న ఆ మూడు జిల్లాలో రెగ్యులర్ ఎస్పీ లేడా?

మావోలు ఎక్కువున్న ఆ మూడు జిల్లాలో రెగ్యులర్ ఎస్పీ లేడా?

అసలే సెన్సిటివ్‌ ఏరియాలు. అదనపు బలగాలు, అలెర్ట్‌గా ఉండే అధికారులు ఉండాలి.కానీ, ఒకేసారి మూడు జిల్లాలకు పోలీస్‌ బాస్‌ లు లేకుండా పోయారు. ఇంతకాలం ఇన్‌ చార్జులతో నడిపించినా, ఇప్పుడదీ లేకుండా పోయింది. 

ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా మహరాష్ట్రను ఆనుకుని ఉంటుంది. కొమురం భీం జిల్లా ఇటు వైపు, అటు వైపు గడ్చిరోలి జిల్లా ఉంటుంది. ఈ రెండు జిల్లాల సరిహద్దుల్లో మావోయిస్టులు యథేచ్చగా తిరుగుతుంటారనే వార్తలొస్తుంటాయి. మావోయిస్టుల కదలికలు ఈ స్థాయిలో ఉన్న చోట పోలీసు సిబ్బంది, అధికారులు పక్కాగా ఉండాలి. కానీ, ఇక్కడ రెగ్యులర్ ఎస్పీ లేకపోవటంపై విమర్శలు వినిపిస్తున్నాయి.

మావోయిస్టుల కదలికలు ఉన్న చోట ప్రత్యేక నిఘా టీముల అవసరం ఉంటుంది. జిల్లా ఎస్పీ ఎప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. పైగా కరోనా విజృంబిస్తున్న నేపథ్యంలో వైద్యశాఖతోపాటు పోలీసులకు కూడా బాధ్యత చాలా ఉంటుంది. ఇలాంటి తరుణంలో జిల్లాలో పోలీస్‌ బాస్ లేని పరిస్థితి ఏర్పడింది. కొమరం భీం జిల్లా లో ఎస్పీగా పనిచేసిన మల్లారెడ్డి  2020 జనవరి 31న రిటైర్ అయ్యారు. అప్పటి నుంచి ఇక్కడ ఇంచార్జ్ ఎస్పీలతోనే నెట్టుకొస్తున్నారు. ఇదే జిల్లాలో మావోల సంచారంపై ఆ మధ్య డిజీపీ ఏకంగా మూడు నాలుగు రోజుల పాటు ఇక్కడే మకాం వేసారు. ఆ సమయంలో కూడా ఆదిలాబాద్ జిల్లా ఎస్పీగా ఉన్న విష్ణువారియర్ ఇంచార్జ్ ఎస్పీగా ఉన్నారు. తర్వాత కొద్దినెలలకు రామగుండం సీపీ సత్యనారాయణకు ఇంచార్జ్ బాద్యతలు అప్పగించారు. 

ఇక నిర్మల్ జిల్లా ఎస్పీగా పనిచేసిన శశిధర్ రాజు సైతం గతేడాది జూన్ లో రిటైర్ అయ్యారు. అప్పటి నుంచి ఆదిలాబాద్ జిల్లా ఎస్పీగా ఉన్న విష్ణు వారియరే ఆ జిల్లాకు కూడా ఇంచార్జ్ ఎస్పీగా ఉన్నారు. ఈ మధ్య జరిగిన బైంసా అల్లర్లు పెద్ద ఎత్తున చర్చనీయాంశమయ్యాయి. ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఇంచార్జ్ ఎస్పీనే విధుల్లో ఉన్నారు.

ఇక ఇప్పుడు ఉన్న ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ సైతం ఖమ్మంకు బదిలీ అయ్యారు. దీంతో ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాలకు పోలీస్‌ బాస్‌ లేని పరిస్థితి ఏర్పడింది. 
అటు కొమురం భీం జిల్లాకు ఇంచార్జ్ ఎస్పీగా రామగుండం సీపీ ఉన్నారు. అయితే రామగుండం సీపీ పరిధిలో మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాలుండగా ఆయనకే కొమురం భీం జిల్లా ఇంచార్జ్ ఎస్పీగా బాద్యతలున్నాయి. సీపీకీ ఆరెండు జిల్లాల్లో జరిగే క్రైంలతోనే సరిపోతోంది. కొమరం భీం జిల్లాపై దృష్టి పెట్టే పరిస్థితి పెద్దగా లేదు. 

ఓవరాల్‌గా ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో మొత్తం నాలుగు జిల్లాలుంటే, అందులో మూడు జిల్లాలకు ఇప్పుడు రెగ్యులర్‌ ఎస్పీ లేరు. కొమురం భీం జిల్లాకు ఇంచార్జ్ ఎస్పీ ఉండగా ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాలకు ఇంచార్జ్ గా ఉన్న ఎస్పీ విష్ణువారియర్ సైతం బదిలీ కావడంతో  రెగ్యులర్ ఎస్పీ వచ్చేదెప్పుడా అనే చర్చ నడుస్తోంది.