'మన్కడింగ్' కావాలని చేసింది కాదు: అశ్విన్
ఐపీఎల్ 12వ సీజన్లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ శుభారంభం చేసింది. సోమవారం రాజస్థాన్ రాయల్స్‌ను సొంతగడ్డపై 14 పరుగుల తేడాతో మట్టికరిపించింది. మొదట క్రిస్ గేల్ (79; 47 బంతుల్లో 8×4, 4×6), సర్ఫ్రాజ్ ఖాన్ (46 నాటౌట్; 29 బంతుల్లో 6×4, 1×6) మెరుపులు మెరిపించడంతో పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 184 పరుగులు చేసింది.
అనంతరం భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్తాన్‌కు మంచి ఆరంభం లభించింది. ఓపెనర్లు అంజిక్య రహానే, జోస్ బట్లర్లు పంజాబ్ బౌలర్లపై విరుచుకుపడటంతో పవర్ ప్లేలో 64 పరుగులు వచ్చాయి. ఈ ఇద్దరూ తొలి వికెట్ కు 78 పరుగులు జోడించారు. అయితే రహానే (27) తొమ్మిదో ఓవర్లో అవుట్ అయ్యాడు. బట్లర్.. శాంసన్ అండతో బౌండరీలు బాదుతూ స్కోరును 100 దాటించాడు. ఈ క్రమంలో 13వ ఓవర్ వేస్తున్న పంజాబ్ కెప్టెన్ అశ్విన్.. ఆ ఓవర్ చివరి బంతికి బట్లర్‌ను 'మన్కడింగ్' ద్వారా ఔట్ చేసాడు. దీంతో నిరాశగా బట్లర్ మైదానాన్ని వీడాడు. అనంతరం వరుస విరామాల్లో రాజస్థాన్ జట్టు వికెట్లు కోల్పోవడంతో ఓడిపోయింది. బట్లర్‌ను 'మన్కడింగ్' ద్వారా ఔట్ చేయడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
మ్యాచ్ అనంతరం పంజాబ్ కెప్టెన్ రవించంద్రన్ అశ్విన్ మాట్లాడుతూ... మా అందరికి తెలుసు పిచ్ 6 ఓవర్ల తర్వాత నెమ్మదిస్తుందని. అనుకున్నట్టుగానే మాకు అనుకూలంగా మారింది. బౌలర్లు అద్భుతంగా రాణించారు. ఈ విజయం వారిదే. నేను చాలా వైవిధ్యంగా బంతులేసా, అది ఫలితాన్ని ఇవ్వడంతో చాలా సంతోషంగా ఉంది. మన్కడింగ్‌పై అసలు చర్చే అనవసరం. మన్కడింగ్ కావాలని చేసింది కాదు, అలా జరిగిపోయిందంతే. బంతి వేసే సమయంలో.. నా బౌలింగ్ యాక్షన్ పూర్తి కాకముందే బట్లర్ క్రీజ్ వదిలాడు. ఈ విషయంలో నేను స్పష్టంగా ఉన్నా. అదే మ్యాచ్ ను మలుపుతిప్పింది. ఇలాంటివే మ్యాచ్‌ను మలుపు తిప్పుతాయి కాబట్టి బ్యాట్స్‌మన్ జాగ్రత్తగా ఉండాలని అశ్విన్ చెప్పుకొచ్చారు.
ఫేస్ బూక్ వ్యాఖ్యలు (0)