అనంత వైసీపీ నేతల్లో ఎవరి కుంపటి వారిదేనా?

అనంత వైసీపీ నేతల్లో ఎవరి కుంపటి వారిదేనా?

ఏడాదిన్నర క్రితం వరకు అధికారం లేక అల్లాడిపోయారు. పసుపుకోటలో వైసీపీ జెండాను రెపరెపలాడించి పాగా వేశారు. ఫైట్‌ చేయడానికి జిల్లాలో విపక్షం లేదని భావించారో ఏమో.. స్వపక్షంలోనే విపక్షాన్ని వెతుక్కున్నారు అధికారపార్టీ నాయకులు. ఎవరికి వారు కుంపట్లు పెట్టుకుని విభేదాలకు ఆజ్యం పోస్తున్నారట. 

స్థానికంగా పట్టు సాధించే పనిలో నేతలు!

అనంతపురం జిల్లాలోని 14 అసెంబ్లీ స్థానాల్లో 12చోట్ల పాగా వేసింది వైసీపీ. రెండు ఎంపీ సీట్లూ వైసీపీ ఖాతాలోనే పడ్డాయి. ఎన్నికల్లో గెలిచేంత వరకూ స్నేహంగా మెలిగిన నాయకుల వైఖరి.. పార్టీ అధికారంలోకి వచ్చాక మారిపోయింది. అసలు కథ మొదలైంది. ఎవరికి వారు బరి గీసుకుని.. ఇంకొకరిని తమ నియోజకవర్గాల్లో వేలు పెట్టనివ్వడం లేదు. స్థానికంగా పట్టు సాధించేందుకు తెగ శ్రమిస్తున్నారు నాయకులు. 

నేతలు ఒకరినొకరు విశ్వసించే పరిస్థితి లేదా? 

జిల్లాలో వైసీపీ నుంచి గెలిచిన వారిలో అనేక మంది సీనియర్లు ఉన్నా.. ఫస్ట్‌టైమ్‌ ఎమ్మెల్యే  శంకరనారాయణకు కేబినెట్‌లో చోటు కల్పించారు. ఇది మంత్రిపై ప్రతికూల ప్రభావం పడిందని టాక్‌. మంత్రివర్గంలో చోటు ఆశించిన అనేకమంది ఎమ్మెల్యేలు ఆయనపై గుర్రుగా ఉన్నారు. ఏ కార్యక్రమానికీ శంకరనారాయణను పిలిచేవారు కాదు. ఈ విషయం తెలిసి అధిష్ఠానం సీరియస్‌ అయిందో ఏమో... తర్వాత అంతా సర్దుకున్నారు. ప్రస్తుతానికి పైకి అంతా బాగానే కనిపిస్తున్నా ఎవరినీ విశ్వసించడానికి లేదనే కామెంట్స్‌ వైసీపీలోనే బలంగా ఉన్నాయట. 

మంత్రి శంకరనారాయణ వర్సెస్‌ ఎమెల్యే ప్రకాష్‌రెడ్డి!

రాప్తాడు ఎమ్మెల్యే ప్రకాష్‌రెడ్డికి మంత్రి శంకరనారాయణకు పడటం లేదన్నది జిల్లాలో బహిరంగ రహస్యమే. వాస్తవానికి కేబినెట్‌లో ప్రకాష్‌రెడ్డికే చోటు దక్కుతుందని ఆయన అనుచరులు భావించారు. ఇది ఇద్దరు నేతల మధ్య దూరం పెంచేసింది. హంద్రీనీవా, HLC నుంచి సమృద్ధిగా నీరు ప్రహిస్తున్నా..  పరిగి చెరువుకు నీటిని విడుదల చేయడం లేదని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి నియోజకవర్గానికి వస్తోన్న నీటిని ప్రకాష్‌రెడ్డి  మళ్లించారన్నది మంత్రి వర్గం చేస్తోన్న ఆరోపణ. ఈ సమస్య ఇంకా చల్లారలేదు. ఇంతలోనే మంత్రికి వ్యతిరేకంగా ఓ వ్యక్తి ప్రకాష్‌రెడ్డితో మాట్లాడిన ఆడియో ట్రోల్‌ అయింది. ఈ ఆడియో ఇంకో గొడవకు బీజమేసింది. ఆ ఫోన్‌ ఎంపీ గోరంట్ల మాధవ్‌కు వస్తే మధ్యలో ప్రకాష్‌రెడ్డి మాట్లాడారని ఎమ్మెల్యే వర్గం వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది.

ఎమ్మెల్యే ఉషాశ్రీచరణ్‌ వర్సెస్‌ ఎంపీ తలారి రంగయ్య!

ఇక కల్యాణదుర్గం ఎమ్మెల్యే ఉషాశ్రీచరణ్‌కు ఎంపీ తలారి రంగయ్య వర్గానికి అస్సలు పడటం లేదు.  ఈ నియోజకవర్గంలో ఎంపీ తలారికి కూడా ప్రత్యేక వర్గం ఉందట. దీంతో ఎమ్మెల్యే, ఎంపీ అనుచరుల మధ్య పొసగటం లేదట. అంతేకాదు.. బోయ సామాజికవర్గాన్ని అడ్డం పెట్టుకుని కల్యాణదుర్గంలో రాజకీయం చేస్తే ఊరుకునేది లేదని ఎమ్మెల్యే ఉషాశ్రీచరణ్‌ గట్టిగానే చెబుతున్నారట. కానీ.. ఎమ్మెల్యే ప్రమేయం లేకుండానే కల్యాణదుర్గంలో ఎంపీ కొన్ని కార్యక్రమాలు హాజరు కావడం ఇద్దరి మధ్య రాజకీయ రచ్చకు దారితీసింది. ఎమ్మెల్యే హాజరవుతున్న కార్యక్రమాల్లో ఏర్పాటు చేసే ఫ్లెక్సీలలో ఎక్కడా ఎంపీ ఫొటో లేకుండా జాగ్రత్త పడుతోందట ఉషాశ్రీ చరణ వర్గం. జిల్లాలో జరుగుతున్న ఈ పరిణామాలన్నీ వైసీపీ అధిష్ఠానం దృష్టిలో ఉన్నాయని సమాచారం. అందుకే అవసరం వచ్చినప్పుడు తగిన కారణం చూపించి స్వపక్ష నేతలకు చెక్‌ పెడుతున్నారట ఎంపీలు, ఎమ్మెల్యేలు. మరి.. నేతల మధ్య గ్యాప్‌ పెరగకుండా పార్టీ పెద్దలు ఎలాంటి మంత్రం వేస్తారో చూడాలి.