తెలుగు రాష్ట్రాల మధ్య బస్సులు ఇక రోడ్డెక్కవా ?

తెలుగు రాష్ట్రాల మధ్య బస్సులు ఇక రోడ్డెక్కవా ?

తెలుగు రాష్ట్రాల మధ్య అంతర్రాష్ట్ర బస్ సర్వీసుల అంశం ఇప్పటికీ కొలిక్కి రాలేదు. ప్రత్యేకించి పర్మిట్ల విషయంలో ఇరురాష్ట్రాలు వాటి వైఖరికే కట్టుబడి ఉండడంతో.. చర్చల్లో ఎలాంటి పురోగతి కనిపించడం లేదు. దీంతో సీఎంల స్థాయి సమావేశం జరిగితే తప్పా.. బస్సు సర్వీసులు ప్రారంభమయ్యే పరిస్థితి లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. దేశవ్యాప్తంగా లాక్‌ డౌన్‌ నిబంధనలు సడలించారు. రాష్ట్రాల మధ్య రాకపోకలు పునరుద్దరించారు. కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ప్రజారవాణకు  కేంద్రం అనుమతించింది. రూట్ పర్మిట్ల విషయంలో నెల రోజుల నుంచి ఉన్నతాధికారుల మధ్య చర్చలు జరుగుతున్నా .. ఎలాంటి పురోగతి కనిపించడం లేదు.

తెలంగాణ భూ భాగంలో ఏపీ బస్‌ సర్వీసులను తగ్గించుకోవాలనేది తెలంగాణ ప్రభుత్వం వాదన.  ఏపీ భూ భాగంలో తమ బస్‌ సర్వీసులను పెంచుకుంటామని.. అయితే ఆ సర్వీసులు అన్ని రూట్లల్లో కాకుండా.. కేవలం బెజవాడ-హైదరాబాద్‌ మధ్య తిప్పుతామని తెలంగాణ అధికారులు చెబుతున్నారు.బస్‌ సర్వీసులతో పాటు తిరిగే కిలోమీటర్ల పరిధిని తగ్గించుకునేందుకు ఏపీ సిద్దంగా ఉన్నా.. ఏపీ తగ్గించుకున్నంత మేరలో బస్‌ సర్వీసులు తిప్పడానికి టీఎస్ఆర్టీసీ సిద్దంగా లేనట్టు సమాచారం. మధ్యే మార్గంగా కొన్ని సర్వీసులను తిప్పుతూ.. రాకపోకలను మొదలు పెడదామనే ఏపీ ప్రతిపాదనకు తెలంగాణ అధికారులు నో చెప్పేశారు.

తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు బస్ సర్వీసులు ప్రారంభమవుతున్నా.. తెలుగు రాష్ట్రాల మధ్యమాత్రం ఈ పరిస్థితి కనిపించడం లేదు.ఇటీవలే సమస్య పరిష్కారానికి ఏపీ చొరవ తీసుకుని, మంత్రుల స్థాయిలో సమావేశానికి ముందుకు వచ్చింది. తెలంగాణ ససేమిరా అనడంతో మంత్రుల సమావేశాల జరగలేదు. దీంతో  సీఎంల మధ్య చర్చ జరిగితే తప్ప,  సమస్య ఓ కొలిక్కి వచ్చే సూచనలు కన్పించడం లేదు. మరోవైపు..అంతర్రాష్ట్ర బస్ సర్వీసుల అంశం పెండింగ్‌లో ఉండడంతో  ఏపీ.. తెలంగాణ ఆర్టీసీలకు భారీ స్థాయిలో నష్టం వాటిల్లుతోంది. ప్రైవేట్‌ బస్‌ ఆపరేటర్లకు కాసుల వర్షం కురుస్తోంది.