జగన్ చొరవ చేసుకున్నా కొలిక్కిరాని గన్నవరం వైసీపీ విభేదాలు !

జగన్ చొరవ చేసుకున్నా కొలిక్కిరాని గన్నవరం వైసీపీ విభేదాలు !

గన్నవరం వైసీపీ విభేదాలకు పునాదిపాడులో తెర పడిందని అంతా భావించారు. స్వయంగా సీఎం జగన్‌ చొరవ తీసుకుని ప్రత్యర్థుల చేతులు కలపడంతో అంతా కొలిక్కి వచ్చిందని అనుకున్నారు.  ఈ విషయంలో ముఖ్యమంత్రి ఒకటి తలిస్తే.. యార్లగడ్డ మరొకటి అనుకున్నారా? ఇంతకీ ఏం జరుగుతోంది? 

దాడులు, కేసులతో గన్నవరం వైసీపీ గరం గరం!

టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ సీఎం జగన్‌కు జైకొట్టిన నాటి నుంచి గన్నవరం రాజకీయంగా రగులుతూనే ఉంది. వంశీ రాకను ఆయన చేతిలో ఓడిన వైసీపీ నేత యార్లగడ్డ వెంకట్రావు వ్యతిరేకించారు. యార్లగడ్డకు చెక్‌ పెట్టేందుకు మరో వైసీపీ నేత దుట్టా రామచంద్రావుతో స్నేహం చేశారు వంశీ. దీంతో మరో గత్యంతరం లేక గన్నవరాన్ని ఖాళీ చేశారు యార్లగడ్డ. ఇక్కడితో ఈ ఎపిసోడ్‌ ఆగిపోతే మాజా ఏముందని అనుకున్నారో ఏమో కానీ.. వంశీకి దుట్టా రివర్స్‌ అయ్యారు. శత్రువుకు శత్రువు మిత్రుడు అన్నట్టు యార్లగడ్డను దువ్వారు దుట్టా. ఈ పరిణామాల తర్వాత ఎమ్మెల్యే వంశీకి.. దుట్టా, యార్లగడ్డ వర్గాలకు మధ్య అస్సలు పడటం లేదు. కొట్లాటలు, దాడులు, కేసులు ఒకటేమిటి ఓ రేంజ్‌లో వైసీపీ రాజకీయాలు కాక రేపుతున్నాయి. 

వంశీ, యార్లగడ్డ చేతులు కలిపిన సీఎం జగన్‌

వైవీ సుబ్బారెడ్డి లాంటి పార్టీ పెద్దలు జోక్యం చేసుకుని రాజీకి యత్నించినా గన్నవరం పంచాయితీ కొలిక్కి రాలేదు. ఈ సమస్యకు ముగింపు ఏంటా అని అనుకుంటున్న సమయంలో పునాదిపాడులో సీఎం జగన్‌ పర్యటనలో చోటుచేసుకున్న పరిణామాలు అనూహ్య మలుపు తిప్పాయి. వైసీపీలోనూ హాట్ హాట్‌ చర్చకు కారణమయ్యాయి. సీఎం జగన్‌ను కలుద్దామని యార్లగడ్డ వెంకట్రావు వెళ్లగా.. మంత్రి కొడాలి నాని ద్వారా ఎమ్మెల్యే వల్లభనేని వంశీని పిలిపించారు ముఖ్యమంత్రి. వంశీ, యార్లగడ్డ చేతులు కలిపి మాట్లాడారు సీఎం జగన్‌. 

పునాదిపాడు పరిణామాలకు ఇబ్బందిపడ్డ యార్లగడ్డ!

సెకన్ల వ్యవధిలో జరిగిన ఈ పరిణామాలతో యార్లగడ్డ కూడా షాక్‌ అయ్యారట. దీని తర్వాత మచిలీపట్నంలో జరిగిన బ్యాంకర్ల మీట్‌లో పాల్గొనేందుకు యార్లగడ్డ వెళ్లిపోయారు. ఇదే సమయంలో పునాదిపాటు ఘటనపై అటు గన్నవరం నుంచి.. ఇటు అభిమానుల నుంచి పెద్ద సంఖ్యలో ఫోన్లు వచ్చినా యార్లగడ్డ ఆన్సర్‌ చేయలేదట. పునాదిపాడులో పరిణామాలను ఆయన ఇబ్బందిగా ఫీలయ్యారట. అందుకే ఎవరినీ కలవకుండా.. ఫోన్లు ఎత్తకుండా మౌనం పాటిస్తున్నారని టాక్. 

వంశీపై ఫిర్యాదు చేయాలని భావించిన యార్లగడ్డ

ఈ మొత్తం ఎపిసోడ్‌ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ శిబిరానికి ఫుల్‌ ఖుషీ తీసుకొచ్చిందట.  అదే సమయంలో యార్లగడ్డ మాత్రం రగిలిపోతున్నారట. వాస్తవానికి పునాదిపాడులో సీఎం జగన్‌ను కలిసి.. గన్నవరంలో వంశీవల్ల వైసీపీ శ్రేణులు ఇబ్బంది పడుతున్నాయని ఫిర్యాదు చేయాలని అనుకున్నారట యార్లగడ్డ. కానీ.. అనుకున్నదొక్కటీ.. అయిందొక్కటీ కావడంతో షాక్‌ అయ్యారట. 

సీఎంను మరోసారి కలిసి యార్లగడ్డ ఫిర్యాదు చేస్తారా? 

ప్రస్తుతం ఎవరికీ అందుబాటులో లేరట యార్లగడ్డ వెంకట్రావు. త్వరలోనే సీఎం జగన్‌ను కలిసి  తన ఆవేదన, వంశీవల్ల పార్టీ శ్రేణులు ఇబ్బంది పడుతున్నాయని క్లారిటీగా చెప్పాలని అనుకుంటున్నారట. మరి.. అప్పటి వరకూ గన్నవరం వైసీపీ రాజకీయాలు ఎన్నెన్ని మలుపులు తిరుగుతాయో చూడాలి.