నివర్‌ తుఫాన్‌ బీభత్సం.. ఏపీలోని ఐదు జిల్లాల్లో విధ్వంసం..

నివర్‌ తుఫాన్‌ బీభత్సం.. ఏపీలోని ఐదు జిల్లాల్లో విధ్వంసం..

నివర్‌ తుఫాన్‌ ఏపీలో విధ్వంసం సృష్టిస్తోంది.. తుఫాన్‌ ప్రభావంతో చిత్తూరు, కర్నూలు, ప్రకాశం, కడప జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మిగిలిన చోట్ల అక్కడక్కడ మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు ఉన్నాయి. తీవ్రంగా వీస్తున్న గాలులకు ఎక్కడికక్కడ చెట్లు నేలకూలాయి. నేషనల్ హైవే పైకి వర్షపు నీరు రావడంతో నెల్లూరులో ట్రాఫిక్‌ జామ్ అయింది. తుపాను కారణంగా నెల్లూరు, చిత్తూరులో నష్టం తీవ్రత ఎక్కువగా ఉంది. తిరుమలలో  కనుమ మార్గంలో కొండచరియలు విరిగిపడ్డాయి. హరిణి ప్రాంతంలో రహదారిపై బండ రాళ్లు పడ్డాయి. రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో 30 సెంటీమీటర్ల వర్షం పడింది. కడప జిల్లా సీకే దిన్నే మండలంలోని బుగ్గవంక ప్రాజెక్టు నాలుగు గేట్లను ఎత్తివేసి నీటిని దిగువకు విడుదల చేశారు. జిల్లాలోని ఒంటిమిట్ట చెరువు 10 ఏళ్లు తర్వాత జలకళ సంతరించుకుంది. తిరుపతిలో  లోతట్టు ప్రాంతాలు నీటి మునిగాయి. ప్రాధాన రోడ్లన్ని జలమయం అయ్యాయి. వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది.

ఇక, నెల్లూరు జిల్లాలో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. పలుచోట్ల విద్యుత్ స్తంభాలు నేల కొరిగాయి. చాలా చోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. రహదారులపై చెట్లు కూలి పడటంతో ఎన్డీఆర్‌ఎఫ్ సిబ్బంది వాటిని తొలగించారు. పంటకాలువలు, రహదారులు చెరువులను తలపిస్తున్నాయి.  జిల్లాల్లోని 1600 చెరువులు నిండు కుండను తలపిస్తున్నాయి. సోమశిల, కండలేరు నుంచి భారీగా సముద్రంలోకి నీటి విడుదల చేశారు. నాయుడుపేటలో నివర్ తుఫాన్ ప్రభావంతో రాత్రి కురిసిన వర్షానికి ఎగువ ప్రాంతాల నుండి స్వర్ణముఖి నదికి భారీగా వరద నీరు చేరుకుంటోంది. నివర్ తుఫాన్‌ దృష్ట్యా దక్షిణ మధ్య రైల్వే పలు రైళ్లను రద్దు చేసింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాల్లోని తుఫాన్‌ ప్రభావిత ప్రాంతాల్లో నడిచే 7 రైళ్లు నిలిపివేసినట్లు తెలిపింది. మరో 8 సర్వీసులను దారి మళ్లించింది. హైదరాబాద్-తాంబరం, మధురై-బికనూరు, చెన్నై సెంట్రల్-సంత్రగచి మధ్య రైళ్ల రాకపోకలను రద్దు చేశారు.  స్పైస్‌ జెట్‌, ఇండిగో విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. ఢిల్లీ నుంచి రేణిగుంట రావాల్సిన ఎయిర్‌ ఇండియా విమానం వాతావరణం అనుకూలించక బెంగళూరులో ల్యాండ్‌ అయింది. తుఫాను ప్రభావంతో రాష్ట్రంలోని మిగతా ప్రాంతాల్లోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరో 24 గంటల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. తుపాను సహాయక చర్యలను ముఖ్యమంత్రి జగన్ పర్యవేక్షిస్తున్నారు. తుపాను ప్రభావంతో చెరువులకి గండి పడకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని, సహాయక చర్యలు ముమ్మరం చేయాలని, అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండాలని చెప్పారు. బాధితులకు  సకాలంలో ఆహారం, తాగునీరు, మందులు సరఫరా చేయాలని అధికారులను ఆదేశించారు.