కేంద్రం కీలక నిర్ణయం.. పాత వాహనాలకు కొత్త ట్యాక్స్‌..!

కేంద్రం కీలక నిర్ణయం.. పాత వాహనాలకు కొత్త ట్యాక్స్‌..!

కాలుష్యానికి కారణమవుతున్న వాహనాల విషయంలో కేంద్ర రవాణా శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. కాలుష్య నివారణలో భాగంగా పాతబడిన వాహనాలకు గ్రీన్‌ ట్యాక్స్‌ విధించాలని నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలపై కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ సంతకం చేశారు. రాష్ట్రాల సంప్రదింపుల అనంతరం దీన్ని కేంద్రం నోటిఫై చేయనుందని అధికారులు తెలిపారు. కాలుష్య నివారణలో భాగంగా 8 సంవత్సరాల పైబడిన రవాణా వాహనాలకు 10 నుంచి 25 శాతం వరకు గ్రీన్‌ ట్యాక్స్‌ చెల్లించాల్సి ఉంటుంది. ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్‌ పునరుద్ధరణ సమయంలో ఈ ట్యాక్స్‌ వసూలు చేయనున్నట్లు సంబంధిత అధికారులు తెలిపారు. అలాగే, 15 సంవత్సరాల కంటే పాత వ్యక్తిగత వాహనాలు కూడా గ్రీన్‌ ట్యాక్స్‌ పరిధిలోకి వస్తాయి.

ఇక, ప్రభుత్వ ప్రజారవాణా వాహనాలపై మాత్రం కొంత తక్కువ మొత్తంలో పన్ను వసూలు చేయనుంది ప్రభుత్వం.. మరో విషయం ఏంటంటే.. కాలుష్య పూరిత నగరాల్లో గ్రీన్ ట్యాక్స్ ఏకంగా 50 శాతం వరకూ ఉండొచ్చని తెలుస్తోంది. వాహనం ఏ కరమైనది, ఎటువంటి ఇంధనం వినియోగిస్తోందనే అంశాల వారీగా కూడా పన్ను చెల్లింపుల్లో మార్పులు ఉండనున్నాయి. హైబ్రీడ్, ఎలక్ట్రికల్, ప్రత్యామ్నాయ ఇంధనాలు వినియోగించే వాహనాలకు మాత్రం మినహాయింపు ఇవ్వాలని కేంద్రం భావిస్తోంది. వ్యవసాయానికి అనుబంధంగా ఉండే ట్రాక్టర్లు, హార్వెస్టర్లు, టిప్పర్లకు కూడా ఇది వర్తింపజేయనున్నారు.