సుప్రీంకు సుగాలి ప్రీతి కేసు.. రంగంలోకి 'నిర్భయ' న్యాయవాది సీమా కుష్వాహ

సుప్రీంకు సుగాలి ప్రీతి కేసు.. రంగంలోకి 'నిర్భయ' న్యాయవాది సీమా కుష్వాహ

కర్నూలు జిల్లాకు చెందిన సుగాలి ప్రీతి కేసు అప్పట్లో రాష్ట్రంలో సంచలనం సృష్టించింది.. ఇప్పుడు ఈ కేసులో సుప్రీంకోర్టుకు వెళ్లాలని నిర్ణయం తీసుకున్నారు సుగాలి ప్రీతి కుటుంబసభ్యులు.. దీని కోసం నిర్భయ కేసులో వాదనలు వినిపించిన న్యాయవాది సీమా కుష్వాహను కలిశారు.. ఈ కేసులో ఏపీ పోలీసులు మాకు అన్యాయం చేశారని ఆమె దృష్టికి తీసుకెళ్లారు సుగలి ప్రీతి తల్లిదండ్రులు.. జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ ర్యాలీ చేశారు... తర్వాత ప్రభుత్వం సీబీఐకి ఇస్తామని చెప్పింది.. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత 8 నెలలకు సీబీఐ విచారణకు ఆదేశించారు.. కానీ, ఇప్పటి వరకు సీబీఐ కేసును పట్టించుకోవడం లేదని ఆమెకు వివరించారు. దీంతో.. 2017లో సుగాలి ప్రీతిపై అత్యాచారం, హత్య కేసుపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నారు సీమా కుష్వాహ.

సుప్రీం కోర్టు  పర్యవేక్షణలో సీబీఐ దర్యాప్తు జరపాలని కోరుతూ సుప్రీం కోర్టు లో పిటిషన్ దాఖలు చేయనున్నారు “నిర్భయ” న్యాయవాది సీమా కుష్వాహ... ప్రీతి కుటుంబ సభ్యులకు భద్రత కల్పించాలని కూడా సుప్రీంకోర్టులో వచ్చే వారం పిటీషన్ దాఖలు చేయనున్నారు.. 2017లో కట్టమంచి రామలింగ రెడ్డి స్కూల్ లో పదోతరగతి చదువుతున్న సుగాలి ప్రీతిపై అత్యాచారం చేసి హత్య చేవారు.. తన కూతురి పై జరిగిన అత్యాచారం, హత్య పై సీబీఐ విచారణ చేయాలని ఐదు రోజులుగా ఢిల్లీలో ప్రముఖులను కలుస్తున్నారు సుగాలి ప్రీతి కుటుంబ సభ్యులు... తమ కూతురు పై జరిగిన అత్యాచారం, హత్య కు కారణమైన వారి పై చర్యలు తీసుకోవాలని ఢిల్లీలో ఎస్సీ కమిషన్, కేంద్ర హోమ్ శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డితో సహా, సిబిఐ అధికారులను, నిర్భయ కేసు ను వాదించిన న్యాయవాది సీమా కుష్వాహను కూడా కలిశారు. తమకు న్యాయం చేయాలని విన్నవించారు.