కాంగ్రెస్ పార్టీని క్షమించాను: వైఎస్ జగన్

కాంగ్రెస్ పార్టీని క్షమించాను: వైఎస్ జగన్

తొమ్మిదేళ్ల క్రితం కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత పార్టీ పెట్టుకున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి తాను కాంగ్రెస్ ను క్షమించానని శుక్రవారం ప్రకటించారు. ఆ పార్టీ తనకు ఎలాంటి పగ, ప్రతీకారం లేవని స్పష్టం చేశారు. 'నాకు ఎవరిపైనా పగ, ప్రతీకారం, ఫిర్యాదులు లేవు. నాకు దేవుడిపై విశ్వాసం ఉంది. నేను రోజూ బైబిల్ చదువుతాను. పగ అనేది నాది కాదు, అది దేవుడు నిర్ణయిస్తాడని నేను బలంగా నమ్ముతాను. వాళ్లని నేను మనస్ఫూర్తిగా క్షమించాను. నా మటుకు నాకు నా రాష్ట్రమే ప్రాధాన్యత. ప్రత్యేక హోదా నా ప్రాధాన్యత' అని సీఎన్ఎన్-న్యూస్18కి చెప్పారు.

ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇవ్వనందుకు బీజేపీ, ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కూడా జగన్ తీవ్రంగా విమర్శించారు. ప్రత్యేక హోదా హామీపై బీజేపీ మాట మార్చిందని దుయ్యబట్టారు. బీజేపీ, అధికార టీడీపీ అబద్ధాలకోర్లన్న జగన్, ఆంధ్రప్రదేశ్ ప్రజలను కేంద్ర ప్రభుత్వం దారుణంగా మోసం చేసిందని నిప్పులు చెరిగారు. 'కేంద్రం ఇచ్చామని చెబుతున్న ప్రత్యేక ప్యాకేజీ ఆంధ్రప్రదేశ్ కి ఎప్పుడూ ఇవ్వలేదు. టీడీపీ, బీజేపీ అబద్ధాలాడుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రజల నమ్మకాన్ని బీజేపీ వమ్ము చేసింది. వాళ్లు ఎప్పుడూ ప్రత్యేక హోదా ఇవ్వలేదని' మండిపడ్డారు.

రాబోయే లోక్ సభ ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీ, కాంగ్రెస్ లకు ఎలాంటి అవకాశాలు లేవని తేల్చి చెప్పారు. 'రాహుల్, మోడీ ఇద్దరూ ఆంధ్రప్రదేశ్ లో కీలకం కారు. పుల్వామా దాడి తర్వాత మోడీ పట్టుదల కలిగిన నాయకుడుగా అవతరించి ఉండవచ్చు. కానీ ఇక్కడ ఆయన ప్రధాన విషయమే కారని' జగన్ స్పష్టం చేశారు. రైతుల రుణ మాఫీ విషయంలో చంద్రబాబు తన విశ్వసనీయత కోల్పోయారని చెప్పారు. 2014 ఎన్నికలకు ముందు చాలా మంది తనను రైతు రుణ మాఫీ ప్రకటించాలని కోరారని, కానీ తను జాగ్రత్తగా ముందుకెళ్లినట్టు వివరించారు. '2014 ఎన్నికలపుడు చాలా మంది వ్యవసాయ రుణ మాఫీ ప్రకటించాలని చెప్పారు. కానీ నేను అది సాధ్యం కాదని చెప్పాను. మేం ఎన్నికల్లో ఓడిపోయాం. టీడీపీ ప్రకటించింది. అదంతా జరిగిన తర్వాత ఇవాళ ప్రజలు నా నిర్ణయం సరైందని భావిస్తున్నారు. టీడీపీ లేదా చంద్రబాబు కంటే నా విశ్వసనీయత మెరుగ్గా ఉందని' వివరించారు.

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్, టీడీపీల మధ్య అప్రకటిత ఒప్పందం ఉందని జగన్ ఆరోపించారు. ఆ పార్టీల టికెట్ పంపిణీ పద్ధతి చూస్తేనే అది అర్థమవుతుందని చెప్పారు. తనకు బీజేపీతో కానీ టీఆర్ఎస్ తో కానీ ఎలాంటి ఎన్నికల ఒప్పందాలు లేవని స్పష్టం చేశారు. తను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే పరిమితమవుతానని, గెలిచినప్పటికీ ఆంధ్ర దాటి విస్తరించబోనని స్పష్టం చేశారు.