భారీ లాభాలతో ముగిసిన నిఫ్టి

భారీ లాభాలతో ముగిసిన నిఫ్టి

అంతర్జాతీయ మార్కెట్ల ఉత్సాహంతో నిఫ్టి భారీ లాభాలతో ముగిసింది. క్రితం ముగింపుతో పోలిస్తే నిఫ్టి 128 పాయింట్లు, సెన్సెక్స్ 453 పాయింట్ల లాభంతో ముగిశాయి. రాత్రి అమెరికా  ఫెడరల్‌ బ్యాంక్‌ అధ్యక్షుడు పావెల్‌ చేసిన వ్యాఖ్యాలతో స్టాక్‌ మార్కెట్‌లో ఉత్సాహం నెలకొంది. 2019లో ఫెడరల్‌ బ్యాంక్‌ వడ్డీ రేట్ల పెంపు విషయంలో జాగ్రత్తగా ఉంటుందని, ఎడాపెడా పెంచే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఆర్థికవృద్ధి రేటు, ద్రవ్యోల్బణం ఉన్నా... వెను వెంటనే వడ్డీ రేట్లను పెంచమని స్పష్టం చేశారు. దీంతో అమెరికా మార్కెట్లు  ముఖ్యంగా నాస్‌డాక్‌ మూడు శాతం లాభంతో ముగిశాయి. ఉదయం ఆసియా మార్కెట్లో కాస్త ఉత్సాహం ఉన్నా చైనా, హాంగ్‌సెంగ్‌లు నష్టాల్లో క్లోజ్‌ కాగా, జపాన్‌ నిక్కీ  స్వల్ప లాభంతో ముగిసింది. మిడ్‌సెషన్‌ తరవాత యూరో మార్కెట్లు కూడా ఉత్సాహంగా భారీ లాభాలతో ప్రారంభమయ్యాయి.

డాలర్‌ పెరుగుదలపై అనుమానాలు వ్యక్తం కావడం, ముడి చమురు ధరలు బాగా క్షీణించడంతో రూపాయి ఒకదశలో 80పైసలు బలపడింది. దీంతో షేర్లు భారీ లాభాలతో ముగిశాయి. అమెరికా నాస్‌డాక్‌ పెరిగినా.. మన ఔటీ నిఫ్టి సూచీ నష్టాలతో ముగిసింది. మిగిలిన అన్ని రంగాల షేర్ల సూచీలు లాభాలతో ముగిశాయి. లాభాల్లో టాప్‌లో ఉన్న నిఫ్టి షేర్లలో బజాజ్‌ ఫైనాన్స్‌, కొటక్‌ బ్యాంక్‌, బజాజ్‌ ఆటో, హిందాల్కో, మహీంద్రా అండ్‌ మహీంద్రా ఉన్నాయి. ఇక నష్టాలతో ముగిసిన నిఫ్టి షేర్లలో హెచ్‌సీఎల్‌ టెక్‌ టాప్‌లో ఉంది. తరవాతి స్థానాల్లో పవర్‌ గ్రిడ్‌, ఓఎన్‌జీసీ, టెక్‌ మహీంద్రా, ఎన్‌టీపీసీ ఉన్నాయి. ఇతర షేర్లలో సుజ్లాన్‌ ఆరు శాతం నష్టపోయింది. ఎస్‌ బ్యాంక్‌ ఒకదశలో 148కి క్షీణించినా.. తరవాత కోలుకుని రూ. 161 వద్ద అంటే క్రితం ముగింపు వద్దే ముగిసింది.