అంబానీ ఇంటి వద్ద పేలుడు పదార్థాల కేసులో మరో ట్విస్ట్..!

అంబానీ ఇంటి వద్ద పేలుడు పదార్థాల కేసులో మరో ట్విస్ట్..!

ప్రముఖ పారిశ్రామికవేత్త ముఖేశ్‌ అంబానీ ఇంటి వద్ద పేలుడు పదార్థాలు గల వాహనం కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. పేలుడు పదార్థాలు లభ్యమైన వాహన యజమాని అనుమానాస్పద పరిస్థితుల్లో చనిపోవడంతో ఈ కేసును నేషనల్ ఇన్వెస్టిగేషన్‌ ఏజెన్సీ -ఎన్‌ఐఏకి అప్పగించింది మోడీ సర్కార్‌. కేంద్ర హోం శాఖ ఆదేశాల మేరకు కేసు దర్యాప్తు చేపడుతున్నట్టు ఎన్‌ఐఏ తెలిపింది. కాగా, ఫిబ్రవరి 25న రెండు వాహనాల్లో వచ్చిన దుండగులు... పేలుడు పదార్థాలు స్కార్పియో వాహనాన్ని అంబానీ నివాసమైన అంటిలియా వద్దకు వచ్చారు. తర్వాత స్కార్పియో వాహన డ్రైవర్‌ దానిని అక్కడ పార్క్‌ చేసి... వెంట వచ్చిన రెండో వాహనం ఎక్కి అక్కడి నుంచి జారుకున్నట్టు సీసీటీవీ కెమెరాల ఫుటేజ్‌ ఆధారంగా గుర్తించారు ముంబై పోలీసులు. దీంతో స్కార్పియో వాహన యజమాని మన్‌సుఖ్‌ హీరేన్‌ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. అయితే, అప్పటికి వారం క్రితమే తన వాహనం చోరీకి గురైందని చెప్పాడు హీరేన్‌. అతను చెప్పినట్టే ఫిబ్రవరి 18న కారు పోయినట్టు అతను పోలీస్‌ స్టేషన్లో ఫిర్యాదు చేసిన వాస్తవమేనని తేలింది. దీంతో పోలీసులు ఈ కేసును భిన్న కోణాల్లో దర్యాప్తు చేస్తుండగా, ఈ నెల 5న అనుమానాస్పద పరిస్థితుల్లో హీరేన్‌ చనిపోయాడు. ఠాణేలో సముద్ర ఒడ్డున హీరేన్‌ మృతదేహం లభ్యమైంది. హీరేన్‌ది హత్యా? ఆత్మహత్యా? లేక ప్రమాదవశాత్తు చనిపోయాడా? అనే సందేహాలకు ఇంత వరకూ సమాధానం దొరకలేదు. అతను నీట మునగడం వల్ల చనిపోయినట్టు భావిస్తున్నారు. ఈ క్రమంలో రంగంలోకి దిగిన ముంబై పోలీసు విభాగానికి చెందిన యాంటీ టెర్రర్‌ స్క్వాడ్ - ఏటీఎస్. హీరేన్‌ మృతిని హత్య కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేస్తోంది.. మృతదేహం లభ్యమైన ప్రదేశాన్ని ఇప్పటికే ఏటీఎస్ బృందం పరిశీలించింది.

ఇక, కేసును ఓ వైపు ఏటీఎస్ దర్యాప్తు చేస్తుండగా, కేంద్ర ప్రభుత్వం.. ఎన్‌ఐఏకు అప్పగించడంపై మహారాష్ట్ర సర్కార్‌ గుర్రుగా ఉంది. కేంద్రం తీరును మహారాష్ట్ర హోం మంత్రి, నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ నేత అనిల్‌ దేశ్‌ముఖ తప్పుబట్టారు. సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ మృతిపై సీబీఐ దర్యాప్తుతో పోల్చుతూ విమర్శలు చేశారు. సుశాంత్‌ది హత్యో? ఆత్మహత్యో ఇంత వరకూ సీబీఐ తేల్చ లేకపోయిందని వ్యాఖ్యానించారు. మన్‌సుఖ్‌ హీరేన్‌ మృతి కేసులో ఏటీఎస్ దర్యాప్తు కొనసాగుతుందని స్పష్టం చేశారు అనిల్‌ దేశ్‌ముఖ్‌.  హీరేన్‌ మృతితో పాటు వాహనం చోరీ కేసును ఏటీఎస్ దర్యాప్తు చేస్తుందన్నారాయన. అయితే, ముఖేశ్‌ అంబానీ ఇంటి దగ్గర పేలుడు పదార్థాల కారు కేసును ఎన్‌ఐఏతో దర్యాప్తు చేయించాలని గతంలో మహారాష్ట్ర బీజేపీ నేతలు డిమాండ్‌ చేశారు. దీనికి తగ్గట్టుగానే కేంద్ర దర్యాప్తు సంస్థకు కేసును అప్పగించింది మోడీ సర్కార్‌. దీంతో ఇప్పటికే అగ్గి-గుగ్గిలంలా ఉన్న కేంద్రం-మహారాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఈ వ్యవహారం మరింత సెగ పెంచింది.