ఎమ్మెల్యే నోముల ఆరోగ్యం బాలేదా?

ఎమ్మెల్యే నోముల ఆరోగ్యం బాలేదా?

అధికార పార్టీకి చెందిన ఆ ఎమ్మెల్యేను సొంత పార్టీ నేతలే టార్గెట్‌ చేశారా? ఆయన ఆరోగ్యంపై వదంతులు మొదలుపెట్టేశారా? నియోజకవర్గంలో ఉపఎన్నిక వస్తుందనేంత తీవ్రంగా ప్రచారం ఎందుకు చేస్తున్నారు? ఇంతకీ ఎవరా ఎమ్మెల్యే..ఆయనపై పార్టీ నేతలకు ఎందుకంత అసమ్మతి? 

నోములను ఇరుకున పెట్టేందుకు అసమ్మతివర్గం కొత్త ఎత్తుగడ!

నోముల నర్సింహయ్య. నాగార్జునసాగర్‌ టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే. శాసనసభ్యుడిగా.. పార్టీ నేతగా నియోజకవర్గంలో ఆయన పనితీరు స్థానిక పార్టీ నేతలకు రుచించడం లేదట. మొదటి నుంచి పార్టీ జెండా మోసిన వారిని కాదని.. సొంత సామాజికవర్గానికే నోముల ప్రాధాన్యం ఇస్తున్నారని ఆరోపిస్తున్నారు పార్టీ నేతలు. స్థానిక ఎన్నికల్లో సైతం తనకు అనుకూలంగా ఉన్న నాయకులకే  ప్రయారిటీ ఇచ్చారనే విమర్శలతో అసమ్మతి పెరిగిపోయింది. దీంతో అసమ్మతి నాయకులు ఎమ్మెల్యేను ఇరుకున పెట్టేందుకు ప్రారంభించిన ప్రచారం అందరి ఆశ్చర్య పరుస్తోందట. 

ఆరోగ్యం బాగానే ఉందని నోముల వివరణ!

ఎమ్మెల్యే నోముల నర్సింహయ్యకు ఆరోగ్యం క్షీణించిందని సోషల్‌ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. త్వరలో నాగార్జున సాగర్‌ నియోజకవర్గానికి ఉప ఎన్నిక వస్తుందని కూడా కామెంట్స్‌ పెడుతున్నారట. ఈ విషయం ఆనోటా..ఈ నోటా తెలుసుకున్న నోముల కంగుతిన్నారట. దాంతో తన ఆరోగ్యం బాగానే ఉందని.. సోషల్‌ మీడియాలో వచ్చే పోస్టులు నమ్మొద్దని వివరణ ఇచ్చుకున్నారు నోముల. కాకపోతే సొంత పార్టీ నేతలే ఈ విధమైన ప్రచారం చేయడం ఆయన వర్గానికి మింగుడు పడటం లేదట. 

సొంత పార్టీ నేతలు నిద్ర లేకుండా చేస్తున్నారా? 

ఒక కమ్యూనిస్ట్‌గా రాజకీయాల్లోకి వచ్చిన నోముల.. నకిరేకల్‌ CPM ఎమ్మెల్యేగా రెండుదఫాలు పనిచేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో సీపీఎం పక్ష నేతగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారాయన. తెలంగాణ ఏర్పాటు తర్వాత సీపీఎంను వీడి టీఆర్‌ఎస్‌లో చేరిపోయారు నోముల. ఆ తర్వాత నకిరేకల్‌ నుంచి నాగార్జునసాగర్‌కు మారారు. 2014లో జానారెడ్డి చేతిలో ఓడిపోయినా.. 2018లో అదే జానారెడ్డిపై గెలిచారు నోముల. తన రాజకీయ అనుభవంతో, మాటల తూటాలతో ప్రత్యర్థులకు చెమటలు పట్టించిన ఆయనకు ఇప్పుడు సొంత పార్టీలోని ఓ వర్గం నిద్ర లేకుండా చేస్తోంది. 

ప్రతి చిన్న కార్యక్రమానికీ హాజరు!

ప్రేమ ఎక్కువైతే ఇలాంటి ప్రచారమే జరుగుతుందని పార్టీలోని ప్రత్యర్థులకు చురకలు వేస్తున్నారు నోముల. వారికి ప్రజలే బుద్ధి చెబుతారని అసమ్మతి వర్గంపై స్వరం పెంచారు. కాకపోతే సోషల్‌ మీడియాలో జరుగుతున్న ప్రచారానికి జవాబిచ్చేందుకు ప్రతి చిన్న కార్యక్రమానికీ హాజరు కావాల్సిన పరిస్థితి వస్తోందట ఎమ్మెల్యేకు.  నియోజకవర్గంలోనే ఉంటూ.. ప్రజలను నిత్యం కలిసి  మాట్లాడుతున్నారట. దీంతో ఆయన పరిస్థితి చూసిన వారంతా పాపం నోముల అంటున్నారట.